ఇదేంటి..? టైటిల్ రివర్స్ అయ్యింది అనుకొంటున్నారా? అదేం కాదు. నిజంగానే చిరంజీవి డైరెక్ట్ చేశాడు… అదీ దర్శకుడు వినాయక్ ని.
చిరు – వినాయక్ కాంబినేషన్లో ఖైదీ నెం.150 తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. చిత్రీకరణ ఆల్మోస్ట్ పూర్తయిపోయింది. ప్రస్తుతం ప్యాచ్ వర్క్ సాగుతోంది. ఇందులో వినాయక్ ఓ చిన్న పాత్రలో తళుక్కున కనిపించబోతున్నాడు. అందుకు సంబంధించిన సీన్ కోసం వినాయక్ కెమెరా ముందుకొస్తే.. కెమెరా ముందు ఉండాల్సిన చిరు.. కాసేపు కెప్టెన్ కుర్చీలో కూర్చుని `యాక్షన్ కట్` చెప్పాల్సివచ్చింది. అలా చిరు దర్శకుడయ్యాడు… వినాయక్ నటుడిగా మారాడు. చిరు డైరెక్షన్లో నటించడం చాలా కొత్తగా థ్రిల్లింగ్‌గా ఉందని వినాయక్ సంబరపడిపోతున్నాడు. చిరు – వినాయక్‌ల ఠాగూర్‌లో కూడా వినాయక్ ఓ పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే. ఆ సెంటిమెంట్‌ని ఖైదీ సినిమా కోసం రిపీట్ చేశారన్నమాట. ఆల్రెడీ ఓ పాటలో చిరుతో కలసి చరణ్ స్టెప్పులేసిన సంగతి తెలిసిందే. మున్ముందు ఇంకెంతమంది ప్రత్యేక పాత్రల్లో కనిపించడానికి ముందుకు వస్తారో చూడాలి. అన్నట్టు ఈ చిత్రంలోని గీతాల్ని ఈనెల 25న విజయవాడలో విడుదల చేయనున్న సంగతి తెలిసిందే. ఆ కార్యక్రమానికి పవన్ కల్యాణ్ కూడా వస్తాడన్న ప్రచారం ఊపందుకొంది. అయితే చిత్రబృందం మాత్రం ఇప్పటి వరకూ ఈ విషయంలో స్పందించలేదు.