2025 సంక్రాంతి… మెగా అభిమానులకు చేదు జ్ఞాపకాన్ని మిగిల్చింది. ఎన్నో అంచనాలతో వచ్చిన ‘గేమ్ ఛేంజర్’ దారుణంగా నిరాశ పరిచింది. సంక్రాంతి సీజన్‌ని కూడా క్యాష్ చేసుకోలేకపోయిన సినిమా ఇది. ఫ్లాప్ మాట అటుంచితే.. చరణ్ ఎఫర్ట్ మొత్తం బూడిదలో పోసిన పన్నీరులా మారింది. ‘ఆర్.ఆర్.ఆర్’ తరవాత ఇలాంటి స్క్రిప్టు ఎందుకు ఎంచుకొన్నాడంటూ ఫ్యాన్స్ బాధ పడ్డారు. సినిమాలోని కొన్ని మూమెంట్స్ కూడా ట్రోలింగ్ కి గురయ్యాయి. సరిగ్గా ఏడాది తిరిగింది. ఈ సంక్రాంతికి చిరంజీవినే రంగంలోకి దిగారు. ‘మన శంకర వర ప్రసాద్ గారు’తో ఓ సూపర్ హిట్టు తన ఖాతాలో వేసుకొన్నారు. చిరు కెరీర్లోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. దాదాపు అన్ని ఏరియాలూ బ్రేక్ ఈవెన్ దిశగా పరుగులు తీస్తున్నాయి. ఇప్పటికే అటూ ఇటుగా రూ.300 కోట్ల గ్రాస్ తెచ్చుకొందని చిత్రబృందం అధికారికంగానూ ప్రకటించేసింది.
ఓరకంగా మెగా ఫ్యాన్స్ కు ఈ సినిమా ఊరట ఇచ్చిందనే చెప్పుకోవాలి. ముఖ్యంగా చిరు సినిమాకు ఇన్ని వసూళ్లు రావడం, థియేటర్లు కిటకిటలాడిపోవడం చూసి చాలా కాలం అయ్యింది. ‘వాల్తేరు వీరయ్య’ తరవాత చిరు చేసిన కొన్ని సినిమాలు నిరాశ పరిచాయి. వాటికి కనీసం ఓపెనింగ్స్ కూడా రాలేదు. చిరు పేరు చెబితే.. టాక్ తో పని లేకుండా థియేటర్లు నిండేవి. కొన్నాళ్లుగా ఆ ఊసు కనిపించలేదు. మళ్లీ చాలా కాలం తరవాత.. ఆ ఉధృతికి బాక్సాఫీసు సాక్ష్యంగా నిలిచింది. నిజానికి సంక్రాంతి సీజన్ చిరుకి బాగా కలిసొచ్చింది. రీ ఎంట్రీ తరవాత ఖైదీ నెంబర్ 150, వాల్తేరు వీరయ్య చిత్రాలు పండక్కే వచ్చాయి. ఇప్పుడు వర ప్రసాద్ వంతు. ఇవి మూడూ ఒకదాన్ని మించి మరోటి హిట్. పైగా గతేడాది చరణ్ ఫ్లాపు లెక్క కూడా చిరు ఈ యేడాదే సరి చేసినట్టైంది.


