మన దేశంలో ఉన్నతంగా ఆలోచించలేని, అసలు విషయాలను అవగాహన చేసుకోలేని మనుషులు ఎంతమంది ఉన్నారో తెలియదు కానీ, సినిమా స్టార్స్ అభిమానుల్లో మాత్రం ఎక్కువ మంది అలాంటి వాళ్ళే ఉన్నారు. కోట్లకు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్స్ తీసుకునే స్టార్స్…. అవసరంలోనో, హాస్పిటల్లోనో ఉన్న ఓ ఇద్దరు మనుషులకు సాయం చేస్తారు. మీడియా అంతా కూడా ఆ వార్తకు అదిరిపోయే కవరేజ్ ఇస్తుంది. అంతే……మా హీరో మళ్ళీ పుట్టిన మదర్ థెరిస్సా, మానవత్వానికే మణిపూస….అని అర్థం పర్థం లేకుండా ఎవరెవరితోనో వాదనలకు దిగుతూ, ఆ స్టార్ హీరోల గొప్పదనం గురించి వాళ్ళతో వాదిస్తూ.. తమక్కూడా తెలియకుండానే ఆ హీరోలకు భక్తులు అయిపోతూ ఉంటారు. కాస్త తెలివైనోడు అయితే తన కెరీర్‌ని కూడా కాపాడుకుంటాడు. ఆ తెలివితేటలు లేకపోతే మాత్రం సినిమా పిచ్చోడనో, ఆ హీరో పిచ్చోడనో ముద్ర వేయించుకుని తన జీవితాన్ని ఫణంగా పెట్టేస్తాడు. ఇలాంటి అభిమానుల పిచ్చిని పీక్స్‌కి తీసుకెళ్ళడానికే ఆయా స్టార్ హీరోలు కూడా అభిమానులే నా ప్రాణం, అభిమానులు నా ఆత్మీయులు, అభిమానులు కూడా మా కుటుంబమే, అభిమానులకు పాదాభివందనం…..అనేలాంటి ఇంకా ఎన్నో అద్భుతమైన డైలాగులను అంతే అద్భుతమైన నటకౌశలంతో అభిమానుల ముందు ప్రదర్శిస్తూ ఉంటారు. ఆ హీరోల పెదాలపై మాటలను గుండెల్లోకి తీసుకునే అభిమానులు మాత్రం వాళ్ళకు అర వీర భయంకరమైన భక్తులు అవుతారు. ఆ తర్వాత అభిమాన హీరోల గొప్పదనాన్ని ఇంకాస్త పెంచడానికి తోటి వాళ్ళతో ఫైటింగులు చేస్తూ ఉంటారు.
చిరంజీవి, మోహన్‌బాబుల అభిమానుల ఫైటింగ్స్ గుర్తున్నాయిగా. ఇప్పుడు బాగా పాపులర్ అయిన సోషల్ మీడియాలో కూడా ఆ మంటలు ఇంకా మండుతూనే ఉన్నాయి. కొన్ని క్రియేటివ్ సెటైరికల్ పోస్టర్స్, కామెంట్స్ చూస్తుంటే అది కేవలం అభిమానుల పనే అంటే నమ్మలేం. ఏ హీరోకి ఆ హీరో….వాళ్ళ గొప్పదనం పెంచడం కోసం, ఎదుటి హీరోని తగ్గించడం కోసం పోస్టర్స్, వీడియోలను తయారు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసే టీంని ఏమైనా మెయింటైన్ చేస్తున్నారేమో అన్న అనుమానాలు వస్తూ ఉంటాయి. అభిమానుల మధ్య గొడవలు తనకు ఎక్కడ చెడ్డపేరు తీసుకొస్తాయో, తన ఇమేజ్ ఎక్కడ డ్యామేజ్ అవుతుందో అన్న ఆలోచన వస్తే తప్ప ఏ ఒక్క హీరో కూడా అభిమానుల ఆగడాలను అడ్డుకునే ప్రయత్నం చేయడు. చిరంజీవి, మోహన్‌బాబులు కూడా సేం టు సేం. వాళ్ళూ వాళ్ళూ ఎప్పుడూ బాగానే ఉంటారు. ఒక వేళ మనస్పర్థలు ఉన్నా అవేవీ కూడా కెరీర్‌కి నష్టం చేసే స్థాయిలో లేకుండా జాగ్రత్తపడతారు. కానీ వాళ్ళ కోసం కొట్టుకుచచ్చే అభిమానులు మాత్రం జీవితాలనే సర్వనాశనం చేసుకుంటూ ఉంటారు. నిన్న మోహన్‌బాబు, చిరంజీవులు స్టేజ్ పైన చూపించిన నట ప్రదర్శనను ఎలా వర్ణించాలో తెలియడం లేదు. ఎవరూ వర్ణించలేరు కూడా. వీళ్ళిద్దరి కోసమో మనం కొట్టుకుచచ్చింది…. వీళ్ళ కోసమేనా సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసుకుని మరీ మనలో మనం తిట్టుకుంది అని అభిమానులందరూ ఫీలవ్వాల్సిందే. స్టార్ హీరోలు, వాళ్ళ స్పాన్సర్డ్ ఫ్యాన్స్ అసోసియేషన్ గొడవల్లో నెక్ట్స్ జెనరేషన్ యువత అయినా పాల్పంచుకోకూడదని…….ఎవడి భవిష్యత్‌ని వాడే భద్రంగా కాపాడుకోవాలని కోరుకుంటూ…….
స్టార్ హీరోల కుటుంబంలో మీరు ఎప్పటికీ సభ్యులు కాలేరు. కనీసం వాళ్ళ ఇంటి గడప కూడా మీరు తొక్కలేరు. స్టార్ హీరోలెవ్వరూ కూడా అభిమానుల కోసం సినిమాలు చేయడం లేదు. ఆ అభిమానులు సినిమాలు చూడడం ద్వారా వచ్చే మనీ కోసం సినిమాలు చేస్తున్నారు. అభిమానుల గురించి వాళ్ళు చెప్పేవన్నీ నోటి మాటలే. అభిమానం కూడా సినిమాలు చూడడం వరకూ మాత్రమే ఉంటే మనందరికీ బాగుంటుంది.