హైదరాబాద్: ప్రతిష్ఠాత్మకంగా రూపొందనున్న 150వ సినిమా ఇప్పుడు ఆగిపోవటంపై చిరంజీవి వివరణ ఇచ్చారు. ఇవాళ ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రస్తుతం తన దృష్టినంతా 150వ సినిమాపైనే కేంద్రీకరించానని చెప్పారు. పూరీ జగన్నాథ్ చిత్రం ఆగిపోవటానికి కారణం స్క్రిప్ట్ పూర్తిగా సిద్ధం కాకపోవటమేనని అన్నారు. పూరీ ఫస్ట్ హాఫ్ వరకు బాగా తయారు చేశారని, అయితే సెకండ్ హాఫ్ సిద్ధం చేసేలోపు అయన వేరే సినిమాలో బిజీ అయిపోవటంతో ప్రాజెక్ట్ ఆగిపోయిందని వివరణ ఇచ్చారు. ప్రస్తుతం వేరే కథలు 2-3 వింటున్నానని, ఒకటి-రెండు నెలల్లో ప్రాజెక్ట్ మొదలవుతుందని చెప్పారు. హీరోయిన్‌గా ఇంకా ఎవరినీ అనుకోలేదని, కథలు చెప్పేవారు అనుష్క అని, తమన్నా అని, నయనతార అని చెబుతున్నారని తెలిపారు. ఏదైనా ఏజ్‌కు, ఇమేజ్‌కు మ్యాచ్ అయ్యేలాగా, అభిమానులను అలరించేవిధంగా హీరోయిన్‌ను ఎంపిక చేస్తామని చెప్పారు. రాజకీయపరంగా ఇప్పుడు తనకు సమయం చాలా ఉందికాబట్టి 150వ సినిమాపైనే దృష్టి పెడుతున్నానని అన్నారు. ఆ సినిమా పూర్తయిన తర్వాత ఏమిటనేదానికి తనవద్ద సమాధానంలేదని చిరు చెప్పారు.