సినీ పరిశ్రమ కోసం తనను అవమానించినా ఓర్చుకున్నా చిరంజీవి పదే పదే టాలీవడ్‌పై ఏపీ సర్కార్ దాడి చేయడాన్ని సహించలేకపోయారు. ఇంత కాలం బహిరంగంగా ఒక్క మాట కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడని ఆయన.. సందర్భం చూసుకుని ఘాటు విమర్శలతో విరుచుకుపడ్డారు. ఎక్కడా ఏపీ ప్రభుత్వం అనే మాట ఎత్త లేదు కానీ.. ఏపీ సర్కార్ ఇండస్ట్రీ విషయంలో చేస్తున్న ప్రతి వ్యవహారాన్ని.. రాజకీయ అంశాలతో ముడి పెట్టి కడిగేశారని అనుకోవచ్చు.
‘వాల్తేరు వీరయ్య’ 200 రోజులు పూర్తి చేసుకున్న నేపథ్యంలో మూవీ టీం తాజాగా సక్సెస్ మీట్ నిర్వహించింది. అందులో మాట్లాడిన చిరంజీవి ‘‘మీలాంటి వాళ్లు ప్రత్యేక హోదా గురించి గానీ, రోడ్ల నిర్మాణం గురించి గానీ, ప్రాజెక్టులు గురించి గానీ, పేదవారికి కడుపు నిండే విషయంగానీ, ఉద్యోగ , ఉపాధి అవకాశాలు కల్పించడం.. వాటి గురించి ఆలోచించాలి. అంతేగాని పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలా సినిమా ఇండస్ట్రీ మీద పడతారేంటి?” అని చిరంజీవి వ్యాఖ్యానించారు. సాధారణంగా చిరంజీవి సినిమా ఈవెంట్స్ కి వచ్చినప్పుడు ఇతర విషయాల గురించి మాట్లాడరు. కానీ ఈ కార్యక్రమంలో మాత్రం ఏపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి చిరంజీవి వ్యాఖ్యానించడం చర్చనీయమైంది.
అదే సమయమంలో తనతో దండం పెట్టించుకున్న అంశాన్ని కూడా పరోక్షంగా ప్రస్తావించారు. మంచి చేస్తే ప్రజలే చేతులెత్తి మొక్కుతారని గుర్తు చేశారు. టాలీవుడ్‌పై ఏపీ ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇటీవల హీరోల రెమ్యూనరేషన్ల గురించి విజయసాయిరెడ్డి ఏకంగా పార్లమెంట్ లోనే ప్రస్తావించారు. వీటన్నింటితో.. టాలీవడ్ పై ఏపీ సర్కార్ తీరుపై ఇక సైలెంట్ గా ఉండకూడదని చిరంజీవి డిసైడయినట్లుగా చెబుతున్నారు.
చిరంజీవి ప్రత్యేక- హోదా ప్రస్తావవ తీసుకు రావడం.. రాజకీయంగా వ్యూహాత్మకమేనన్న అభిప్రాయం కూడా వినిపిస్తోంది. మెడలు వంచుతామని ఓట్లు పొంది.. ఇప్పుడు ప్రజల్ని మోసం చేశారని.. ఇటీవల ప్యాకేజీ డబ్బులు కూడా తీసుకున్నారని.. ఈ అంశాన్ని ప్రజల్లో హైలెట్ చేసేందుకు ఈ మాట మాట్లాడారన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఇంత కాలం చిరంజీవి నోరు ఎత్తట్లేదని ఆయన పేరు వాడేసుకున్న వైసీపీ నేతలు ఇప్పుడేమంటారో వేచి చూడాల్సి ఉంది.