తెలుగు వారికి అతి పెద్ద పండుగ అయిన సంక్రాంతి కి కోడి పందాలు ఎంత ప్రాచుర్యమో, పోటా పోటీ సినిమాలు, అభిమానుల మధ్య థియేటర్ల వద్ద పోటా పోటీ సంబరాలు, కొంతవరకు పోట్లాటలు కూడా అంతే సమానంగా ప్రాచుర్యం పొందాయి. ప్రత్యేకించి తెలుగు సినిమాల్లో అతిపెద్ద మాస్ హీరోలైన చిరంజీవి బాలకృష్ణ ల సినిమాలు విడుదలైనప్పుడు ఈ కోలాహలం మరింత ఎక్కువగా ఉంటుంది. చిరంజీవి సినిమాతో పోటీ గా విడుదల అవడం గురించి ఇటీవల బాలకృష్ణ ” స్పర్థయా వర్ధతే విద్య” అని వ్యాఖ్యానించినట్లు ఈ పోటా పోటీ వాతావరణం పలు సందర్భాలలో రెండు సినిమాలకు కూడా మేలు చేసింది అని చెప్పవచ్చు. అయితే ఇప్పటివరకు సంక్రాంతి సందర్భంగా ఈ ఇద్దరు హీరోల సినిమాలు ఎన్నిసార్లు పోటీ పడ్డాయి, వాటి ఫలితం ఏంటి అన్నది విశ్లేషిద్దాం.
1987:
1987 సంక్రాంతికి మొదటిసారి చిరంజీవి బాలకృష్ణ సినిమాలు ఈ పండుగకు పోటీపడ్డాయి. చిరంజీవి దొంగ మొగుడు సినిమాతో వస్తే, బాలకృష్ణ భార్గవ రాముడు సినిమాతో పోటీకి వచ్చాడు. ఈ రెండు సినిమాలు కూడా హిట్ టాక్ పొందినప్పటికీ, ఓవరాల్ కలెక్షన్ల పరంగా దొంగ మొగుడు సినిమా పై చేయి సాధించింది. యండమూరి నవల ఆధారంగా కోదండరామిరెడ్డి తీసిన ఈ సినిమా పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఉంటే, అదే కోదండరామిరెడ్డి దర్శకత్వంలో, పరుచూరి బ్రదర్స్ రచనలో తెరకెక్కిన భార్గవ రాముడు సినిమా బాగానే ఉన్నప్పటికీ ఆ స్థాయిలో ఎంటర్టైన్మెంట్ ఇవ్వలేకపోయింది. మొత్తానికి ఈ సంవత్సరం సంక్రాంతి కి దొంగ మొగుడు సినిమా విజేతగా నిలిచింది.
1988:
ఆ తర్వాత 1988 లో చిరంజీవి, కే రాఘవేంద్రరావు దర్శకత్వంలో నటించిన మంచి దొంగ సినిమాతో ప్రేక్షకులు ముందుకు వస్తే, బాలకృష్ణ ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో ఇన్స్పెక్టర్ ప్రతాప్ అన్న సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దీనికి ముందు సంవత్సరం వచ్చిన దొంగ మొగుడు భార్గవ రాముడు రెండు సినిమాలు కూడా పెద్ద హిట్లు అయితే, ఈసారి వచ్చిన రెండు సినిమాలు కూడా అబోవ్ యావరేజ్ గా నిలిచాయి. అయితే ముత్యాల సుబ్బయ్య సెంటిమెంటల్ యాక్షన్ డ్రామా తో పోలిస్తే రాఘవేంద్రరావు ఎంటర్టైనర్ కాస్త ఎక్కువ కలెక్షన్లు సాధించింది. దీంతో ఈ సంవత్సరం కూడా చిరంజీవిది పై చేయి అయింది.
1989:
1989లో గీత ఆర్ట్స్ లో అల్లు అరవింద్ నిర్మాతగా, కోదండరామిరెడ్డి దర్శకత్వంలో అత్తకు యముడు అమ్మాయికి మొగుడు సినిమాతో చిరంజీవి ప్రేక్షకుల ముందుకు వస్తే, బాలకృష్ణ కూడా అదే కోదండరామిరెడ్డి దర్శకత్వంలో భలే దొంగ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈసారి కూడా రెండు సినిమాలు పెద్ద హిట్ అయినప్పటికీ, వాణిశ్రీ చిరంజీవిల మధ్య అత్త అల్లుళ్ల ఫైట్ ప్రేక్షకులకు కొత్తగా అనిపించడం, పండుగకు ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా అనిపించడం వంటి కారణాలతో అత్తకు యముడు అమ్మాయికి మొగుడు సినిమా సంక్రాంతి విన్నర్ గా నిలబడింది.
1997:
ఇక 90వ దశలో కొన్నేళ్ల పాటు వీళ్ళిద్దరి సినిమాలు సంక్రాంతికి పోటీ పడడం జరగలేదు. 1997లో మళ్లీ ఈ ఇద్దరు హీరోలు హిట్లర్, పెద్దన్నయ్య సినిమాలతో పోటీపడ్డారు. చిరంజీవి వరుస ప్లాపుల తర్వాత ఒక ఏడాది బ్రేక్ తీసుకుని, తనను తాను విశ్లేషించుకుని, తన స్టైల్ మార్చుకొని తీసిన సినిమా ఇది. ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో మలయాళ రీమేక్ సినిమాతో చిరంజీవి వస్తే, పరుచూరి రచనలో శరత్ దర్శకత్వంలో బాలకృష్ణ పెద్దన్నయ్యతో వచ్చాడు. రెండు సినిమాలు పండుగకి సూపర్ హిట్ అయ్యాయి. హిట్లర్ సినిమా 42 కేంద్రాలలో అప్పట్లో వంద రోజులు ఆడితే, పెద్దన్నయ్య 34 కేంద్రాలలో వంద రోజులు ఆడింది. డాన్సర్ గా ఉన్న రాఘవ లారెన్స్ కొరియోగ్రాఫర్ గా మారి, హిట్లర్ సినిమా లో అబీబి పాటకు ఇచ్చిన స్టెప్ పాతికేళ్ల తర్వాత ఇప్పటికీ కూడా జనాలకు గుర్తుండేలా ఉండడం తెలిసిందే. పూర్తిస్థాయి లో క్లియర్ విన్నర్ అని చెప్పలేకపోయినప్పటికీ, వందరోజుల కేంద్రాల పరంగా చూస్తే హిట్లర్ పెద్దన్నయ్య మీద పై చెయ్యి సాధించింది అని చెప్పవచ్చు. అయితే ఈ సినిమా విడుదల సందర్భంగా చిరంజీవి బాలకృష్ణ అభిమానుల మధ్య ఫైట్ తారా స్థాయికి చేరింది. ఒక థియేటర్ వద్ద ఇద్దరి అభిమానులు గొడవపడితే, ఒక పత్రికలో హిట్లర్ సైన్యానికి పెద్దన్నయ్య తమ్ముళ్ళకి ఫైట్ అంటూ వార్త కథనాలు ప్రచురించబడ్డాయి.
1999:
ఆ తర్వాత 1999 లో చిరంజీవి నటించిన స్నేహం కోసం, బాలకృష్ణ నటించిన సమరసింహారెడ్డి పోటీపడ్డాయి. మొదట విడుదలైన చిరంజీవి తమిళ రీమేక్ సినిమా స్నేహం కోసం కి పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ, బాలకృష్ణ నటించిన సమరసింహారెడ్డి బాలకృష్ణ కెరీర్ లోనే అతిపెద్ద హిట్ గా నిలిచి బాలకృష్ణ కెరీర్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళింది. స్నేహం కోసం సినిమా సుమారు 52 కేంద్రాలలో వంద రోజులు ఆడితే, సమరసింహారెడ్డి 72 కేంద్రాలలో వంద రోజులు ఆడి సంచలనం సృష్టించింది. వందరోజుల కేంద్రాలపరంగా ఇది గత రెండు దశాబ్దాలలో వచ్చిన అన్ని చిరంజీవి సినిమాల రికార్డులను బ్రేక్ చేసింది. 1999 సంక్రాంతి విజేతగా సమర సింహా రెడ్డి సినిమా నిలిచింది.
2000:
2000 సంవత్సరంలో చిరంజీవి ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో అన్నయ్య సినిమా తో వస్తే బాలకృష్ణ , కృష్ణంరాజుతో కలిసి తనకు పెద్దన్నయ్య వంటి హిట్ సినిమా ఇచ్చిన శరత్ దర్శకత్వంలో వంశోద్ధారకుడు సినిమాతో వచ్చాడు. అన్నయ్య సినిమా కి మొదట్లో యావరేజ్ టాక్ వచ్చినప్పటికీ వంశధారకుడు సినిమా మరీ ఘోరంగా ఫ్లాప్ కావడంతో అన్నయ్య సూపర్ హిట్ గా నిలిచింది. దీంతో 2000 సంక్రాంతి కి చిరంజీవి విన్నర్ గా నిలిచాడు.
2001:
2001 లో సంక్రాంతికి చిరంజీవి బాలకృష్ణ మృగరాజు నరసింహనాయుడు సినిమాలతో పోటీపడ్డారు. గుణ శేఖర్ దర్శకత్వంలో ఘోస్ట్ అండ్ డార్క్ నెస్ అనే ఇంగ్లీషు సినిమాకు ఫ్రీ మేక్ గా వచ్చిన మృగరాజు సినిమా అత్యంత దారుణంగా పరాజయం పాలైతే బి గోపాల్ దర్శకత్వంలో వచ్చిన నరసింహనాయుడు సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. సమరసింహారెడ్డి సినిమా తర్వాత ఆ స్థాయి విజయం లేని బాలకృష్ణ కు అంతకు మించిన విజయాన్ని ఈ సినిమా అందించింది. దీంతో ఈ సంవత్సరం సంక్రాంతి విజేతగా బాలకృష్ణ నిలిచారు.
2004:
మళ్లీ 2004 సంవత్సరంలో ఒకరోజు తేడాతో బాలకృష్ణ నటించిన లక్ష్మీ నరసింహ సినిమా, చిరంజీవి నటించిన అంజి సినిమా విడుదలయ్యాయి. కోడి రామకృష్ణ దర్శకత్వంలో దాదాపు ఆరేళ్ల పాటు చిత్రీకరణ జరుపుకున్న అంజి సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. అయితే సామి తమిళ సినిమాకు రీమేక్ గా జయంత్ దర్శకత్వంలో వచ్చిన లక్ష్మీ నరసింహ సినిమా సమరసింహారెడ్డి నరసింహనాయుడు స్థాయిలో హిట్ కాకపోయినప్పటికీ అంజి సినిమా అంటే బెటర్ టాక్ తెచ్చుకుంది. అయినప్పటికీ ఈ సినిమాని సంక్రాంతి విజేతగా చెప్పలేం. ఈ సినిమాతో పాటు అదే రోజున విడుదలైన ప్రభాస్ త్రిష ల వర్షం సినిమా యువతను విపరీతంగా ఆకట్టుకోవడమే కాకుండా, ప్రభాస్ త్రిష లని ఇద్దరిని తెలుగు ప్రేక్షకులకు డార్లింగ్ గా మార్చేసింది. దీంతో చిరంజీవి బాలకృష్ణ సినిమాలు కాకుండా మరొక సినిమా సంక్రాంతి విజేతగా నిలవడం అనే అరుదైన సంఘటన ఈ సంవత్సరం జరిగింది.
2017:
ఇక 2004 తర్వాత మళ్లీ ఇద్దరు హీరోలు 2017 సంక్రాంతికి పోటీపడ్డారు. చిరంజీవి తన రీ ఎంట్రీ కి తమిళ సినిమా కత్తి ని ఎంచుకొని వివి వినాయక్ దర్శకత్వంలో ఖైదీ నెంబర్ 150 తో వస్తే, బాలకృష్ణ క్రిష్ దర్శకత్వంలో గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాతో వచ్చాడు. అయితే ఈ రెండు సినిమాల మధ్య పోటీ మరింత ప్రత్యేకంగా కావడానికి కారణం చిరంజీవి ది150వ సినిమా అయితే బాలకృష్ణది 100 వ సినిమా కావడం. రెండు మైల్ స్టోన్ సినిమాలు ప్రేక్షకుల నుంచి మంచి టాక్ సంపాదించాయి. వీటితోపాటు విడుదలైన శతమానం భవతి సినిమా కూడా పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. మూడు సినిమాలు హిట్ అయినప్పటికీ, కలెక్షన్ల పరంగా ఖైదీ నెంబర్ 150 పై చేయి సాధించింది. అయితే గౌతమీపుత్ర శాతకర్ణి విమర్శకుల ప్రశంసలను పొందింది. తక్కువ ఖర్చులో, తక్కువ సమయంలో సైతం చారిత్రక సినిమాలను తీయవచ్చు అని నిరూపించిన క్రిష్ కు సినీ మేధావుల నుండి విశేష ప్రశంసలు లభించాయి.
2023:
ఇక తాజాగా ఇద్దరు హీరోలు వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రస్తుతానికి రెండు సినిమాలు కూడా మంచి టాక్ సాధించి కలెక్షన్లతో దూసుకు పోతున్నాయి. గతంలో ఇద్దరి హీరోల సినిమాలు ఒకే దర్శకుడితో తీసి సంక్రాంతికి పోటీపడిన సందర్భాలు ఉన్నప్పటికీ, ఒకే నిర్మాణ సంస్థతో ఇద్దరి సినిమా లు రావడం అన్నది మాత్రం ఇదే మొదటిసారి. ప్రస్తుతానికి ఇద్దరు హీరోలు అభిమానులు తమ సినిమా యే సంక్రాంతి విన్నర్ అని చెప్పుకుంటున్నప్పటికీ క్లియర్ విన్నర్ ఎవరు అన్నది మరో మూడు నాలుగు రోజుల్లో తేలిపోతుంది.
– జురాన్ ( @CriticZuran)