చిత్రపరిశ్రమ మారింది.. ప్రేక్షకులూ మారారు. అయితే కొంతమంది హీరోలు మాత్రం అదే పాత స్కూలు పట్టుకొని వెళాడుతున్నారు. తొమ్మిదేళ్ల విరామం తరవాత మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చిన చిరు కూడా ఓల్డ్ స్కూల్ పద్ధతుల్ని ఇంకా వదలుకోకపోవడమే ఇందుకు నిదర్శనం. త్వరలో తన151వ చిత్రం కోసం సురేందర్ రెడ్డితో పనిచేయబోతున్నాడు చిరు. అక్కడి వరకూ ‘కొత్త’గా ఆలోచించినట్టే. ఎందుకంటే సూరి ఈ జనరేషన్ డైరెక్టర్. ఇప్పుడున్న ట్రెండ్, టెక్నాలజీ అన్నీ బాగా తెలుసు. హీరోని ఎంత స్టైలీష్‌గా తీర్చిదిద్దాలో అతనికి అవగాహన ఉంది. బహుశా అది నచ్చే… చిరు తన తదుపరి చిత్రానికి దర్శకుడిగా సూరి పేరుని నిర్ణయించుకొన్నాడు. కానీ.. ఇప్పుడు సూరికి ‘పరుచూరి బ్రదర్స్’ ని జోడించాడు. అక్కడే కాంబినేషన్ తేడా కొట్టేయబోతోంది.
చిరుకి పరుచూరి సోదరులంటే అభిమానం.. గురి! చిరు సక్సెస్ ఫుల్ చిత్రాల్లో వాళ్ల వాటా ఎక్కువ. ఆఖరికి చిరు రీ ఎంట్రీ సినిమాలోనూ ఈ బ్రదర్స్ హ్యాండ్ ఉంది. అందుకే ‘ఏదైనా నాకు నచ్చితేనే చేస్తా.. నచ్చితేనే చూస్తా…’ అనే పరమ పాత ఫార్ములా డైలాగులు వినిపించాయి. పరుచూరి బ్రదర్స్ తమ ఓల్డు స్టాకుకు కోటింగు వేసి కలిపికొట్టిన డైలాగులు ఖైదీ సినిమాలో కోకొల్లలుగా కనిపించాయి.. వినిపించాయి. ఖైదీ సినిమాపై పాత కాలం నాటి ముద్ర పడిపోవడానికి పరుచూరి సోదరుల ప్రతాపం కూడా కారణమే. పరుచూరి బ్రదర్స్‌తో వినాయక్‌కి పనిచేసిన అనుభవం చాలా తక్కువ. అదీ.. చిరు ఠాగూర్ వల్లే అయ్యింది. వినాయక్ అనుభవజ్ఞుడు కాబట్టి పరుచూరి సోదరులతో ఎంత పని చేయించుకోవాలో అంతే చేయించుకొన్నాడు. మిగిలినది బుర్రా సాయిమాధవ్లాంటి ఈజనరేషన్ రైటర్లకు అప్పగించాడు.
ఇప్పుడు సూరి సినిమాలోనూ బ్రదర్స్ జోక్యం మొదలైంది. ఈ సినిమా స్క్రిప్టు వ్యవహారాలన్నీ బ్రదర్స్ దగ్గరుండి చూసుకొంటున్నార్ట. సూరి వీళ్లతో మింగిల్ అవ్వగలడా, లేదా? అనేది ఇప్పుడు అనుమానంగా మారింది. సురేందర్ రెడ్డి స్టైల్ వేరు. అతని స్క్రీన్ ప్లే టెక్నిక్ వేరు. వక్కంతం వంశీలాంటి యంగ్ రైటర్లతోనే సూరితో ఎక్కువ పనిచేశారు. సూరి ఎంచుకొన్న కథ, కథనాలకు బ్రదర్స్ భావజాలానికీ చాలా తేడా ఉంటుంది. కనీసం ఇలాంటి కథల విషయంలో అయినా.. సూరికి చిరు ఫ్రీ హ్యాండ్ ఇస్తే బాగుంటుంది కదా? ‘నీ ఇష్టం వచ్చిన రైటర్లని తీసుకో’ అని చెబితే.. సూరి మరింత స్వేచ్ఛగా పనిచేస్తాడు కదా? ఎంతకాదన్నా పరుచూరి బ్రదర్స్‌ది ఓల్డ్ స్కూల్. ఇప్పటి ట్రెండ్‌లో ఉన్న సూరికీ వీళ్లకీ పొంతన కుదిరే ఛాన్సు లేదు. సురేందర్ రెడ్డి లాంటి దర్శకుడు రాజీ పడిపోతే.. అది సినిమాకి నష్టం. అలాగని బ్రదర్స్ మితిమీరిన జోక్యం చేసుకొంటే.. సూరి కూడా చేసేదేం ఉండదు. వీళ్ల మధ్య బ్యాలెన్స్ .. ఈ చిత్ర జయాపజయాలన్ని నిర్ణయిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
చిరు కూడా తన స్కూల్ మార్చాల్సిన అవసరం ఉంది. పరుచూరి బ్రదర్స్ చేయితిరిగిన రచయితలే కావొచ్చు. కానీ అన్ని కథలూ వాళ్లూ హ్యాండిల్ చేయలేరన్న విషయాన్ని చిరు గుర్తించాలి. ట్రెండ్ మారింది. ఇప్పుడు మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా.. లాంటి డైలాగులకు చప్పట్లు కొట్టరు. వాటిపై సెటైర్లు వేసుకొని ఫేస్ బుక్కుల్లో నవ్వుకొంటారు. అందుకే కొత్తతరానికీ, వాళ్ల ఆలోచనలకు దారి ఇవ్వాల్సిందే. ఈ విషయంలో చిరు ఎప్పుడు కళ్లు తెరుస్తాడో మరి.