చిరంజీవి – అనిల్ రావిపూడి సినిమాకు సంబంధించిన వార్త శుక్రవారం సోషల్ మీడియాలో గట్టిగా హల్ చల్ చేసింది. ఈ సినిమాలో విలన్‌గా యువ హీరో కార్తికేయ నటిస్తున్నాడన్నది ఆ వార్త సారాంశం. నిజానికి ఇది చాలా మంచి ఆప్షన్. స్క్రీన్‌పై చూడ్డానికి బాగుంటుంది. ‘గాడ్ ఫాదర్’లోనూ చిరు ఇలాంటి ప్రయత్నమే చేశాడు. ఆ సినిమాలో సత్యదేవ్ విలన్‌గా నటించాడు. చిరుకి సత్యదేవ్ పెద్ద ఫ్యాన్. కాబట్టి సత్యదేవ్ కి ఆ రూపంలో ఓ ఫ్యాన్ బోయ్ మూమెంట్ ఇచ్చాడు చిరు.
ఇప్పుడు అనిల్ రావిపూడి సినిమా విషయానికొద్దాం. కార్తికేయ కూడా చిరంజీవికి వీరాభిమానే. ఈ విషయం చాలా సందర్భాల్లో చెప్పాడు. ఓ వేదికపై చిరు పాటలకు.. చిరు ముందే స్టెప్పులు వేసి, ఆయన అభిమానానికి పాత్రుడయ్యాడు. అందుకే చిరు సినిమాలో కార్తికేయ విలన్ అనేసరికి ఇంట్రస్టింగ్ బజ్ ఏర్పడింది.
అయితే.. ఈ విషయంలో చిత్రబృందం సైలెంట్ గా వుంది. ‘కార్తికేయ చేస్తున్నాడు’ అని చెప్పలేదు.. అలాగని ‘చేయట్లేదు’ అని ఈ విషయానికి ఇంతటితో పుల్ స్టాప్ పెట్టలేదు. ఓరకంగా చిత్రబృందమే ఈ విషయాన్ని కావాలని లీక్ చేసిందేమో అనిపిస్తోంది. తమ మనసులో మాటని మీడియాకు లీక్ చేసి, ఆ తరవాత వచ్చే రియాక్షన్ గమనించి, అప్పుడు నిర్ణయం తీసుకోవడం కొన్ని సినిమాలకు జరుగుతూ ఉంటుంది. అలా… ఈ ఆప్షన్ని బయటకు తీసుకొచ్చారేమో అనిపిస్తోంది. ఇప్పటి వరకూ చిత్రబృందం కార్తికేయతో సంప్రదింపులు జరపలేదు. కార్తికేయ అనేది మంచి ఆప్షనే. ఇది వరకు అజిత్ సినిమాలో విలన్ గా నటించిన అనుభవం ఉంది. నాని ‘గ్యాంగ్ లీడర్’లోనూ తానే విలన్. చిరుతో సినిమాగానీ ఓకే అయితే.. ఇక కార్తికేయ కెరీర్ సెటిలైపోయినట్టే.