సినిమా సినిమాకీ కాస్త గ్యాప్ ఇచ్చే అలవాటు మానుకొంటున్నారు అగ్ర హీరోలు. వీలైతే ఒకేసారి రెండు సినిమాల్ని పట్టాలెక్కించడానికైనా సిద్ధమే. 2026లో మెగాస్టార్ నుంచి రెండు సినిమాలు రాబోతున్నాయి. ఈ సంక్రాంతికి ‘మన శంకర వర ప్రసాద్ గారు’ వచ్చేస్తోంది. వేసవికి ‘విశ్వంభర’ సిద్ధం అవుతోంది. మరోవైపు కొత్త సినిమా కూడా మొదలెట్టేస్తున్నారు. ‘మన శంకర వర ప్రసాద్ గారు’ తరవాత బాబీ దర్శకత్వంలో చిరు ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. నిజానికి ఈ సంక్రాంతి తరవాత ఈ సినిమాని లాంఛనంగా ప్రారంభిద్దాం అనుకొన్నారు. 18న పూజా కార్యక్రమాలు చేసి, ఫిబ్రవరిలో షూటింగ్ మొదలెడదామని ప్లాన్ చేశారు.
అయితే ఇప్పుడు ఈ ప్లానింగ్ కాస్త మారింది. ఈ నెలలో చిరు కొత్త సినిమా మొదలవ్వడం లేదు. ఫిబ్రవరిలో లాంఛనంగా ప్రారంభిస్తారు. మార్చి నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యే ఛాన్సుంది. చిరంజీవి ఇటీవల మోకాలికి సర్జరీ చేయించుకొన్నారు. దాంతో కొన్ని వారాల పాటు విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అందుకే… షూటింగ్ ఆలస్యం అవుతోంది. మరోవైపు ఈ సినిమాకు సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతోంది. ఈ సినిమాలో మరో అగ్ర కథానాయకుడు కూడా కనిపించనున్నాడని ప్రచారం జరుగుతోంది. ఆ హీరో ఎవర్నది ఇంకా క్లారిటీ రాలేదు. పర భాషా నటుడే.. చిరుతో స్క్రీన్ పంచుకొంటారని టాక్. ఆ హీరో ఎవరో ఇంకొద్ది రోజుల్లో తెలిసిపోతుంది. చిరు – బాబీ కాంబోలో `వాల్తేరు వీరయ్య` వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది. దాంతో ఈ కాంబోపై అంచనాలు మరింత పెరిగాయి.
