కర్ణాటక-గోవా సరిహద్దులోని చోర్లా ఘాట్ అడవుల్లో గతేడాది అక్టోబరులో జరిగిన ఓ చోరీ ఘటన ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. గోవా నుంచి కర్ణాటక మీదుగా మహారాష్ట్రకు వెళ్తున్న రెండు భారీ కంటైనర్లను గుర్తుతెలియని ముఠా అడ్డుకుని, అందులోని భారీ నగదును దోచుకెళ్లింది. శ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ దోపిడీ జరిగిన మూడు నెలల వరకు పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు. ఇటీవల నాసిక్‌కు చెందిన సందీప్ పాటిల్ అనే వ్యక్తి తాను కిడ్నాప్‌కు గురయ్యానని, దోపిడీ గురించి తెలుసుకున్నందుకే తనను బంధించారని ఫిర్యాదు చేయడంతో ఈ మెగా థూమ్ దోపిడి బయటపడింది.
సీన్ లోకి సిట్ – మూడు రాష్ట్రాల వేట!
ఈ కేసు తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న మహారాష్ట్ర ప్రభుత్వం ఎస్పీ స్థాయి అధికారినేతృత్వంలో ప్రత్యేక విచారణ బృందాన్ని ఏర్పాటు చేసింది. తాజాగా బెల్గాం పోలీసులు కూడా ఈ విచారణలో చేరారు. మూడు రాష్ట్రాల పోలీసులు ఇప్పుడు ఆ మాయమైన కంటైనర్ల కోసం అడవులను జల్లెడ పడుతున్నారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే ఒక హవాలా ఆపరేటర్‌తో సహా ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు.
పోలీస్ ఆఫీసర్లు, మత గురువుల హస్తం?
ఈ దోపిడీ వెనుక కేవలం దొంగలే కాదు, కొందరు పోలీసు అధికారులు , ఒక ప్రముఖ మత గురువు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కంటైనర్లను అడ్డుకున్న ముఠాకు పోలీసులే సహకరించారని, అసలు బాధితుడు ఎవరో కూడా స్పష్టంగా తెలియకుండా జాగ్రత్త పడ్డారని తెలుస్తోంది. థానేకు చెందిన ఒక బిల్డర్‌కు చెందిన పాత నోట్లను మార్పిడి చేసే క్రమంలో ఈ దోపిడీ జరిగినట్లు సిట్ అనుమానిస్తోంది. అయితే బాధితుడు బయటకు వచ్చి ఫిర్యాదు చేయకపోవడం ఈ కేసులో అతిపెద్ద మిస్టరీగా మారింది.
అంతా బ్లాక్ మనీ కాబట్టే ఇంత కాలం సైలెంట్ ?
బెల్గాం పోలీసులు నాసిక్ వెళ్లి నిందితులను విచారించేందుకు అనుమతి కోరారు. అయితే, ఆ దోపిడీ నగదు నిజంగానే 400 కోట్లా లేక అంతకంటే ఎక్కుా అన్నది ఇంకా నిర్ధారణ కావాల్సి ఉంది. సంఘటనా స్థలం మూడు రాష్ట్రాల సరిహద్దులో ఉండటంతో, నిందితులు ఎక్కడ నగదును దాచారనే దానిపై క్లూస్ కోసం సాంకేతిక ఆధారాలను విశ్లేషిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటివరకూ బయటకు వచ్చిన సమచారం చాలా తక్కువ. ఇంకా చాలా బయటకు రావాల్సి ఉంది. గుట్టుగా ముగిసిపోతుందా.. ప్రజలకు తెలిసేలా బయటపెడతారా అన్నది మాత్రం ఇంకా ఎవరికీ తెలియదు.