వైసీపీ హాయంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమ వసూళ్లకు, భూ దందాలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ అశోక్ రెడ్డి ఉచ్చు బిగుస్తోంది. కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ ఆదేశాల మేరకు జరిగిన అంతర్గత విచారణలో అశోక్ రెడ్డి సాగించిన అవినీతి బాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే కొన్ని రోజుల క్రితమే ఆయనపై సస్పెన్షన్ వేటు పడగా, ఇప్పుడు ఆయన పనిచేసిన పోలీస్ స్టేషన్లోనే నాన్-బెయిలబుల్ కేసులు నమోదు కావడం పోలీసు వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
అశోక్ రెడ్డి గతంలో సీకే దిన్నె , చిన్నచౌక్ పోలీస్ స్టేషన్లలో సీఐగా విధులు నిర్వహించారు. ఆ సమయంలో ఆయన బాధితుల పక్షాన నిలబడాల్సింది పోయి, సెటిల్మెంట్లకు ప్రాధాన్యత ఇచ్చారనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. ముఖ్యంగా భూ వివాదాల్లో తలదూర్చడం, బాధితులను బెదిరించి భారీగా సొమ్ము వసూలు చేయడం వంటి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. అనంతపురం జిల్లాకు చెందిన ప్రభాకర్ అనే వ్యక్తి ఫిర్యాదు ఈ కేసులో కీలకంగా మారింది. తన ఆస్తులను అక్రమంగా సెటిల్మెంట్ చేయడమే కాకుండా, తనను సీకే దిన్నె పోలీస్ స్టేషన్లో రెండు రోజుల పాటు అక్రమంగా నిర్బంధించి బెదిరింపులకు గురిచేశారని ప్రభాకర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు ఆధారంగానే సి.కె.దిన్నె పోలీసులు సీఐ అశోక్ రెడ్డిపై , ఆయనకు సహకరించిన రాజా సింగ్ పైన కఠిన సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
పోలీస్ యూనిఫామ్ వేసుకుని చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటమే కాకుండా, రాజకీయ అండదండలతో సామాన్యులను ఇబ్బందులకు గురిచేశారు. డీఐజీ కోయ ప్రవీణ్ ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకోవడంతో, అశోక్ రెడ్డి బాధితులు ఇప్పుడు ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదులు చేస్తున్నారు. అక్రమ సంపాదనతో ఆయన కూడబెట్టిన ఆస్తులపైన కూడా ఏసీబీ దృష్టి సారించే అవకాశం ఉందని తెలుస్తోంది. వైసీపీకి అనుకూలంగా పని చేస్తూ.. ఆ తర్వాత తమ దందాలను ఇలా మాఫియా తరహాలో చేస్తూ అడ్డులేకుండా చేసుకునేవారు దారి తప్పిన పోలీసులు. వారంతా ఇప్పుడు ఇరుక్కుపోతున్నారు.
