తప్పు జరిగితే పోలీసులు కేసులు పెడతారు. విచారణ జరుపుతారు. నిజమేంటో కోర్టు దృష్టికి తీసుకెళ్తారు. అది వారి విధి. అయితే ఏపీ సీఐడీ పోలీసులు మాత్రం అసలు తప్పు జరగకుండానే మార్గదర్శిపై విరుచుకుపడుతున్నారు. సంకల్ప సిద్ధి అనే స్కాంలో రూ. 1100 కోట్లు కొట్టేశారంటే చాలా తేలికగా తీసుకున్న పోలీసులు అసలు ఎలాంటి ఆరోపణలు లేకుండా…. సాగుతున్న మార్గదర్శిపై సోదాలు చేసి అక్రమాలు ఉన్నాయని ఊరూవాడా ప్రచారం చేస్తున్నారు. అక్రమాలు ఉంటే బయటపెట్టాలి కానీ అక్రమాలు ఉన్నాయంటూ ఊరూవాడా తిరిగి చెప్పడం ఏమిటి ?
ఢిల్లీలో సీఐడీ చీఫ్ సంజయ్ ప్రత్యేకంగా మార్గదర్శి ఇష్యూపై ప్రెస్ మీట్ పెట్టారు. అసలు ఆయన దర్యాప్తు చేయాలి. నిజంగా అక్రమాలుంటే ఫలానా అక్రమాలు ఉన్నాయని పత్రాలు బయట పెట్టాలి. కానీ అసలు ఏమీ బయట పెట్టకుండా బురద చల్లేందుకు ఇష్టారీతిన ఆరోపణలు చేస్తూ పోతున్నారు. మార్గదర్శి నాలుగు రాష్ట్రాల్లో ఉంది. అందుకే ఢిల్లీలో ప్రెస్ మీట్ పెడుతున్నామని చెప్పుకొచ్చారు. కానీ ఆ నాలుగు రాష్ట్రాలకు లేఖలు రాసి చాలా కాలం అయింది. తప్పులు ఉంటే వారు చర్యలు తీసుకోరా ? విచారణచేయరా ?
ఓ రాష్ట్ర దర్యాప్తు సంస్థ నుంచి ఈడీ, ఐటీ వంటి వాటికి ఫిర్యాదు వస్తే… అవి ఎందుకు పట్టించుకోలేదు . ఈడీ కి లేఖ రాశామని.. మనీలాండరింగ్ జరిగిందని తెగ చెప్పుకొస్తున్నారు. మరి ఈడీ అధికారులకు ఎందుకు ఆ మనీలాండరింగ్ కనిపించడం లేదు. చిట్లు వేయడం.. పాడుకున్న డబ్బులు చెల్లించడం… మార్గదర్శి కంపెనీని వచ్చిన లాభాన్ని ఇతర చోట్ల పెట్టుబడి పెట్టడాన్ని మనీలాండరింగ్ అంటే… ఎలా ?. అదే తప్పు అయితే కోర్టులో పెట్టి శిక్షలు వేయించాలి. అంతే కానీ.. ఇలా మీడియా సమావేశాలు పెట్టి… లేనిపోని ఆరోపణలు చేయడం ఎందుకు ?
మార్గదర్శి ఆర్థిక సేవల సంస్థ. నమ్మకం అలాంటి సంస్థల పెట్టుబడి. ఆ నమ్మకాన్ని దెబ్బకొట్టేందుకు సీఐడీ భారీ కుట్రకు పాల్పడిందని స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. ఇంత కాలం ఆరోపణలు చేసినా… ఆ సంస్థపై ప్రజల్లో నమ్మకాన్ని కనీసం కదిలించలేకపోయారు. అయినా అధికారంతో వచ్చిన పగ, ప్రతీకారాలతో ఇష్టారీతిన వ్యవహరిస్తూ తప్పులు చేస్తూ పోతున్నారు. అది అంతిమంగా పగ, ప్రతీకారాలతో రగిలిపోయేవారి పతనానికే దారి తీస్తుంది. అప్పుడు ఈ కుట్రల్లో భాగమైన వారంతా శిక్షను ఎదుర్కోవాల్సి ఉంటుంది.