ఏపీ సీఐడీ అధికారులు ప్రజలు ఏమనుకుంటారు.. కోర్టులు ఏమనుకుంటాయి.. అని కనీస సిగ్గు కూడా పడటం లేదు. తమ కుట్రల్ని నిస్సిగ్గుగా అమలు చేసేస్తున్నారు. స్కిల్ ప్రాజెక్టు కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ బుధవారం హైకోర్టులో విచారణకు రానుంది. ఒక రోజు ముందుగా టీడీపీ ఖాతాలోకి 27 కోట్లు వచ్చాయని ఆ వివరాలు ఇవ్వాలని సీఐడీ టీడీపీ కార్యాలయంలో నోటీసులు ఇచ్చింది. నిజానికి టీడీపీ ఖాతా వివరాలు.. వచ్చిన డబ్బుల వివరాలన్నీ అనధికారికంగా ఎప్పుడో సేకరించారు. ఏమీ దొరకక.. ఏదో విధంగా కేసుల విచారణను ఆలస్యం చేయడానికి ఇలా అవసరానికో నోటీసు జారీ చేస్తున్నారు.
బెయిల్ పిటిషన్ పై విచారణ ఇప్పటికే పూర్తి కావాల్సి ఉంది. గత విచారణలో అడ్వకేట్ జనరల్ అందుబాటులో లేకపోవడంతో వాయిదా కోరారు. ఏకంగా 22వ తేదీకి వాయిదా కోరారు. కోర్టు కుదరదని చెప్పి పదిహేనో తేదీకి వాయిదా వేసింది. ఇప్పుడు పధ్నాలుగో తేదీన టీడీపీకి నోటీసులు ఇవ్వడం .. చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా కోరడానికేనని భావిస్తున్నారు. నోటీసులు ఇచ్చామని విచారణ జరుగుతోందని చెప్పడానికో ఇచ్చి ఉంటారని టీడీపీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ హయాంలో అమలు చేసిన స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు విషయంలో అవినీతి జరిగిందని సీఐడీ కేసు నోదు చేసింది.
రెండున్నరేళ్ల కిందట కేసు నమోదు చేసి పలువుర్ని అరెస్టు చేశారు. అందరూ బెయిల్ పై విడుదలయ్యారు. ఇప్పటి వరకూ మనీ ట్రయల్ కు సంబంధించి సీఐడీ దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు. నిధులు దారి మళ్లాయని చెప్పడం తప్ప.. ఎక్కడికి వెళ్లాయో చెప్పడం లేదు. అసలు ఎలాంటి నిధులు దారి మళ్లలేదని ఒప్పందం ప్రకారం అన్నీ ఇచ్చామని కాంట్రాక్టర్లు ప్రకటించింది. దీన్ని ప్రభుత్వం కూడా నిర్ధారించింది. అయినా కేసుల పేరుతో వ్యవస్థల్ని ఓ ఆట ఆడుకుంటూనే ఉన్నారు.