లిక్కర్ స్కామ్ ద్వారా చెవిరెడ్డి పోగేసుకున్న ఆస్తుల్ని జప్తు చేసేందుకు సీఐడీ సిట్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వం కూడా అనుమతి ఇచ్చింది. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఆయన కుమారులు మోహిత్‌రెడ్డి, హర్షిత్‌రెడ్డి, కేవీఎస్ ఇన్ఫ్రా మేనేజింగ్ డైరెక్టర్ చెవిరెడ్డి లక్ష్మి పేర్లకు సంబంధించిన ఆస్తుల జప్తునకు హోం శాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ ఉత్తర్వులు జారీ చేశారు. సిట్ దర్యాప్తు నివేదిక మేరకు, అవినీతి నిరోధక చట్టం (ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్) మరియు నేర చట్టాల సెక్షన్ల ప్రకారం ఆస్తులు జప్తు చేస్తున్నారు
చెవిరెడ్డి కుటుంబం మద్యం కుంభకోణంలో పాలుపంచుకుని భారీ మొత్తంలో ఆస్తులు కూడబెట్టింది. రూ. 54.87 కోట్ల నల్లధనాన్ని చట్టబద్ధమైన ఆస్తులుగా మార్చినట్లు తేలింది. తిరుపతి, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో ఉన్న పలు భూములు, ఆస్తులు, వాణిజ్య భవనాలను కొనుగోలు చేశారు. కమీషన్ల ద్వారా సంపాదించిన డబ్బును ఆస్తులుగా మార్చిారు. ఈ ఆస్తులు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పేరుతోనే కాకుండా, ఆయన కుటుంబ సభ్యులు మరియు సంబంధిత కంపెనీల పేర్లతో ఉన్నాయి.
జప్తు ప్రక్రియ పూర్తి చేసి, ఆస్తులను రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి తీసుకోవాలని, అవసరమైతే కోర్టులో కేసు దాఖలు చేయనున్నారు. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి లిక్కర్ స్కామ్ లో క్యాష్ ట్రాన్స్ పోర్టర్ గా వ్యవహరించారు. ఎన్నికల సమయంలో ఆయనే అందరికీ డబ్బులు పంపిణీ చేశారు. ఓ సారి లారీలో తరలిస్తూ ఎనిమిదిన్నర కోట్లు పట్టుబడ్డాయి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇప్పటికి జైల్లోనే ఉన్నారు.


