పరకామణి చోరీ కేసులో సీఐడీ మరో సీక్రెట్ రిపోర్టును కోర్టుకు సమర్పించింది. ఈ నెల రెండో తేదీన మొదటి సారి ఓ నివేదికను కోర్టుకు సమర్పించింది. తర్వాత కూడా దర్యాప్తు కొనసాగించి మరిన్ని వివరాలతో మరో నివేదికను కూడా సీఐడీ సమర్పించింది. ఈ కేసు కొంత మంది చెబుతున్నట్లుగా చిన్న కేసు కాదని.. చాలా లోతుగా ఉందని సీఐడీ రెండో రిపోర్టు కూడా సమర్పించడంతో చాలా మంది అంచనాకు వస్తున్నారు.
నిందితుడు రవికుమార్ కు అన్ని ఆస్తులు ఎక్కడ నుంచి వచ్చాయి… ఎంత కాలం నుంచి పరకామణిలో దొంగతనం చేస్తున్నారు.. దొంగతనం కేసు రాజీ వెనుక వెనుక అసలేం జరిగింది.. లాంటి అంశాలపై లోతుగా దర్యాప్తు చేశారు. అదే సమయంలో రవికుమార్ ఆస్తులు ఎవరెవరి పేర్ల మీదకు బదిలీ అయ్యాయన్నది కూడా ఆరా తీసినట్లుగా తెలుస్తోంది. అన్ని ఆస్తులు తమిళనాడులో ఉన్నాయి. అక్కడే బదిలీ అయ్యాయి. ఈ క్రమంలో అక్కడి ప్రభుత్వం నుంచి సమగ్ర సమాచారం తెలుసుకున్నారని చెబుతున్నారు.
ఈ కేసులో రవికుమార్ ఆస్తులు ఎవరి పేరు మీదకు బదిలీ అయ్యాయో… వారి ప్రోద్భలంతోనే దొంగతనం, కేసు రాజీ జరిగి ఉంటాయని భావిస్తున్నాయి. అదే సమయంలో ఫిర్యాదు దారు అయిన మాజీ విజిలెన్స్ అధికారి సతీష్ కుమార్ మరణంపైనా ఈ నివేదికలో కోర్టు దృష్టికి తీసుకెళ్లే కీలక అంశాలు ఉంటాయని భావిస్తున్నారు. ఈ నివేదికలు విచారణ సమయంలోనే వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.