రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు ఏపీ ప్రభుత్వం నుంచి రిలీఫ్ వచ్చింది. ఆయనపై గత ప్రభుత్వం తీసుకున్న చర్యలన్నింటినీ ఉపసంహరించుకున్నారు. ఏబీవీ పై గత ప్రభుత్వంలో పెట్టిన కేసులు, మోపిన అభియోగాలన్నింటినీ హైకోర్టు కొట్టి వేసింది. అసలు జరగని కొనుగోలులో అవినీతి అంటూ ఆయనపై కేసులు పెట్టి తప్పుడు ప్రచారాలు చేశారు. అప్పటి సీపీఆర్వో శ్రీహరి మీడియాకు తప్పుడు సమాచారం ఇచ్చి దేశద్రోహం ఆరోపణలు కూడా చేయించారు. అప్పటి ప్రభుత్వం కేసులు పెట్టడమే కాదు.. విచారణ కమిటీల్ని నియమించారు.
ఎన్ని చేసినా కోర్టుల్లో అసలు ఫ్రూవ్ చేయలేకపోయారు. చివరికి నాలుగేళ్లకుపైగా సస్పెన్షన్ లో ఉంచి కోర్టు ఉత్తర్వులతో.. చివరి రోజు పోస్టింగ్ ఇచ్చి .. రిటైరయ్యేలా చేశారు. ప్రభుత్వం మారిన తర్వాత ఏడాది వరకూ ఆయనపై పెట్టిన ఫిర్యాదులు, అభియోగాలను ఉపసంహరించుకోలేదు.కోర్టులో ఉన్నందున ప్రభుత్వం వేచి చూసింది. ప్రభుత్వం అన్ని కేసుల్ని కొట్టేయడంతో తదుపరి అన్ని చర్యలను ఉపసంహరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఏబీవీ సూపర్ క్లీన్ గా తేలారు.
అయితే ఆయనను టార్గెట్ చేసి జగన్ రెడ్డి వేధించారన్న విషయం మాత్రం స్పష్టమయింది. ఏబీవీకి నాలుగున్నరేళ్లకుపైగా జీతభత్యాలు కూడా అందకుండా కక్ష సాధించారు. కోర్టులు ఆదేశించినా ఇవ్వలేదు. చివరికి కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పూర్తిగా చెల్లించాలని ఉత్తర్వులు ఇచ్చారు. తదుపరి చర్యలు పూర్తిగా ఉపసంహరించుకున్నందున ఇప్పుడు ఆయనకు.. తన జీతభత్యాలు అందుకునే అవకాశం ఉంది. మొత్తంగా జగన్ రెడ్డి ఓ సీనియర్ ఐపీఎస్ కెరీర్ తో ఆడుకున్నారన్న విషయం నిరూపితమయింది. కానీ ఆయన పై కానీ ఆయన కుట్రల్ని అమలు చేసిన అధికారులపై కానీ..తప్పుడు కేసులు పెట్టిన వారు..తప్పుడు ప్రచారాలు చేసిన వారిపై మాత్రం ఎలాంటి చర్యలు తీసుకునే చాన్స్ లేదు.