తెలంగాణలోని కామారెడ్డి క్లౌడ్ బరస్ట్ తో వణికిపోయింది. పదిేహను గంటల వ్యవధిలో 500 మిల్లీమీటర్ల వర్షం కురవడంతో పట్టణం పూర్తిగా నీట మునిగిపోయింది. కామారెడ్డి జిల్లాలో ఎక్కడ చూసిన వరద విలయమే కనిపిస్తోంది. ఎక్కడ చూసిన నాలుగు అడుగుల వరకూ నీరు నిలబడిపోయింది. కామారెడ్డి జిల్లాలోని రాజంపేటలో ఆగస్టు 27, 2025న రాత్రి 12 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు 136 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మరో 363 మి.మీ. వర్షం కురిసింది. ఇది అసాధారణ వర్షపాతం.
కామారెడ్డి జిల్లాలోని రాజంపేట, తిమ్మారెడ్డి, కల్యాణి వాగు పరిసర ప్రాంతాలు పూర్తిగా నీట మునిగిపోయాయి. మంజీరా నది ఉప్పొంగడంతో పలు గ్రామాలు జలమయమయ్యాయి. రోడ్లు, వంతెనలు ధ్వంసమయ్యాయి. లక్ష్మాపూర్ వద్ద ఒక కల్వర్ట్ కూలిపోవడంతో రవాణా స్తంభించింది. వ్యవసాయ భూములు నీట మునిగాయి, వేలాది ఎకరాల పంటలు నాశనమయ్యాయి. రైల్వేట్రాకులు కూడా కొట్టుకుపోవడంతో అటు వైపు రాకపోకలు నిలిచిపోయాయి. పదుల సంఖ్యలో వంతెనలు ధ్వంసం అయ్యాయి.
కామారెడ్డి పట్టణంలోని హౌసింగ్ బోర్డు పూర్తిగా నీటమునిగింది. అన్ని చోట్ల నుంచి ప్రజల్ని రక్షించారు. కానీ ప్రజా ఆస్తులు మాత్రం పెద్ద ఎత్తున వరదలో కొట్టుకుపోయాయి. కొన్ని వందల కార్లు అలా చెరువుల్లోకి , వాగుల్లోకి కొట్టుకు పోతున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి. మరో రోజు కూడా ఇలాంటి వర్షాలు కురిసే అవకాశాలు ఉండటంతో.. కామారెడ్డి ప్రజలు వణికిపోతున్నారు. ప్రభుత్వ యంత్రాంగం అంతా అప్రమత్తమయింది.