వర్షాకాలం అంటే.. సీజన్ ఉన్నంత కాలం అప్పుడప్పుడూ వర్షాలు పడుతూ ఉంటాయి. నీటి కొరత లేకుండా చేస్తాయి. ఎప్పుడో ఓ సారి తుపాన్లు వస్తాయి. కానీ ఇప్పుడు కాలం మారుతోంది. దానికి పర్యావరణంలో వస్తున్న మార్పుల కారణంగా అన్నీ ఎక్స్ట్రీమ్ అయిపోతున్నాయి. వర్షాలు కూడా ఒక్క సారే పడిపోతున్నాయి. దీనికి క్లౌడ్ బరస్ట్ అని పెరు పెట్టారు. ఇప్పుడు అసలు వర్షాలు పడటం కన్నా.. క్లౌడ్ బరస్టులే ఎక్కువగా జరుగుతున్నాయి.
ఇటీవల హిమాచల్ ప్రదేశ్ లో క్లౌడ్ బరస్ట్ జరిగి ఓ గ్రామం తుడిచి పెట్టుకుపోయింది. నిన్నటికి నిన్న కశ్మీర్ లో అదే పరిస్థితి. పదుల సంఖ్యలో ప్రాణాలు పోతున్నాయి. అవన్నీ పర్వత ప్రాంతాల్లో ఉండే గ్రామాలు.. క్లౌడ్ బరస్ట్ ధాటికి కొండ చరియలు, బురద వచ్చి పడటంతో గ్రామాలు కొట్టుకుపోతున్నాయి. అదే క్లౌడ్ బరస్ట్ మైదాన ప్రాంతాల్లోనూ కామన్ గా మారుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ పడుతున్న వర్షాలు.. సాధారణ వర్షాల్లా లేవు. క్లౌడ్ బరస్టుల్లా పడుతున్నాయి. ఫలితంగా నీళ్లు ఎక్కడివక్కడే నిలిచిపోయేంతగా వర్షాలు పడుతున్నాయి.
ఒక విషయం గమనిస్తే.. బాగా విపరీతంగా ఎండ వచ్చిన తర్వాత ఇలాంటి వర్షాలు పడుతున్నాయి. ఎందుకంటే గ్లోబల్ వార్మింగ్ వల్ల వాతావరణంలో ఆవిరి సామర్థ్యం పెరుగుతోంది. ఉష్ణోగ్రతలు పెరిగే కొద్దీ, వాతావరణం ఎక్కువ తేమను నిలుపుకోగలుగుతుంది, ఇది తీవ్రమైన వర్షపాత సంఘటనలకు దారితీస్తుందని చెబుతున్నారు. హిమాలయ ప్రాంతాలు, కొండ ప్రాంతాలు వంటి ప్రదేశాల్లో పర్వతాల వల్ల గాలి ఎగసిపడటం కారణంగా తేమతో కూడిన గాలి వేగంగా ఎగసి, దట్టమైన మేఘాలను ఏర్పరుస్తుంది, ఇవి క్లౌడ్ బరస్ట్లకు దారితీస్తున్నాయి.
ఇతర ప్రాంతాల్లో రుతుపవనాలు తీవ్రమైన తేమతో కూడిన గాలిని తీసుకొస్తున్నాయి. ఈ తేమ ఒకచోట చేరి, స్థానిక వాతావరణ పరిస్థితులతో కలిసి క్లౌడ్ బరస్ట్లకు కారణమవుతున్నాయి. అటవీ నిర్మూలన, పట్టణీకరణ, మ భూ వినియోగంలో మార్పులు స్థానిక వాతావరణ విధానాలను మారుస్తున్నాయి. ఇవి క్లౌడ్ బరస్ట్ల లాంటి తీవ్రమైన సంఘటనలను పెంచుతున్నాయి. జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ క్లౌడ్ బరస్టుల వల్ల జరిగే నష్టంపై ఇక మానవుడు దృష్టి పెట్టాల్సిన సమయం వచ్చింది.