పిల్లలకు కేవలం హాలీవుడ్ సూపర్ హీరోలైన స్పైడర్‌మ్యాన్, బ్యాట్‌మ్యాన్ , ఐరన్ మ్యాన్ వంటి వారి గురించి మాత్రమే కాకుండా, మన పురాణ పురుషుల గురించి తెలియజేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. తిరుపతిలో జరిగిన భారతీయ విజ్ఞాన సమ్మేళనం ముగింపు వేడుకల్లో చంద్రబాబు నాయుడు ప్రసంగం ఆసక్తికరంగా సాగింది. మన దేశ సాంస్కృతిక వారసత్వాన్ని, పురాణాల గొప్పతనాన్ని ప్రస్తుత సాంకేతికతతో ముడిపెడుతూ ఆయన మాట్లాడారు.
ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన అవతార్ వంటి సినిమాల కంటే మన రామాయణ, భారత గాథలు ఎంతో గొప్పవని, వాటిలో ఉన్న లోతును పిల్లలకు వివరించాల్సిన అవసరం ఉందన్నారు. ఎవరు మంచివారు, ఎవరు చెడ్డవారు అనే విచక్షణ జ్ఞానం పిల్లలకు కలగాలంటే పురాణ కథలే సరైన మార్గమన్నారు. ప్రపంచంలోనే అత్యున్నత వ్యక్తిత్వం కలిగిన పురుషోత్తముడు శ్రీరాముడు అని కొనియాడారు. ఆదర్శవంతమైన పాలన అంటే రామరాజ్యం అని, ఆ పాలన విశిష్టతను నేటి తరానికి వివరించాల్సిన బాధ్యత మనపై ఉందని చెప్పారు.
ఈ సమ్మేళనం విజ్ఞానానికి సంబంధించింది కావడంతో, ఆధ్యాత్మికతకు సైన్స్‌కు ఉన్న సారూప్యాన్ని వివరించారు. భారతదేశం గతంలోనే విజ్ఞానపరంగా ఎంతో ముందుందని, శూన్యం కనుగొన్నది మొదలుకొని ఖగోళ శాస్త్రం వరకు ఎన్నో విషయాలు మన గ్రంథాల్లోనే ఉన్నాయని చెప్పారు. సనాతన ధర్మాన్ని ఆధునిక సాంకేతికతతో కలిపి ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. పిల్లల్లో చిన్నతనం నుంచే భారతీయ సంస్కృతి పట్ల గౌరవం పెంచేలా విద్యా వ్యవస్థలో మార్పులు రావాలని, తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు ఇంట్లోనే పురాణ కథలను వినిపించాలని ఆయన సూచించారు.
చంద్రబాబు నాయుడు తన ప్రసంగంలో మన మూలాలను మర్చిపోకుండానే ప్రపంచంతో పోటీ పడాలి అనే సందేశాన్ని ఇచ్చారు. ఐటీ, టెక్నాలజీ గురించి ఎప్పుడూ మాట్లాడే ఆయన, ఈసారి ఆధ్యాత్మికత, భారతీయ వారసత్వం గురించి గట్టిగా మాట్లాడటం అందర్నీ ఆకట్టుకుంది. అదే సమయంలో టెక్నాలజీని మర్చిపోలేదు. క్వాంటమ్ ప్రస్తావన తెచ్చారు.
