ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్లారు.శుక్రవారం పలువురు కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు. చంద్రబాబు ఢిల్లీ పర్యటన రెండు రోజుల పాటు సాగనుంది. శుక్రవారం కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, నితిన్ గడ్కరీ, సీఆర్ పాటిల్, హర్దీప్ సింగ్ పూరి, సర్బానంద సోనోవాల్ వంటి కేంద్ర మంత్రులతో సమావేశమవుతారు. ఈ భేటీల్లో రాష్ట్రంలోని కీలక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు, జాతీయ రహదారులు, పోలావరం ప్రాజెక్టు, పోర్టుల అభివృద్ధి, ఆర్థిక సహాయం వంటి పలు అంశాలపై చర్చించనున్నారు. కేంద్రం నుంచి నిధులు, అనుమతులు వేగవంతం చేయాలని చంద్రబాబు కోరనున్నట్టు తెలుస్తోంది.
నారా లోకేష్ కూడా ఈ వారమే ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. పలువురు కేంద్ర మంత్రుల్ని కలసి వచ్చారు. మళ్లీ వెంటనే చంద్రబాబు వెళ్తున్నారు. ఇటీవల కేబినెట్ సమావేశంలో కేంద్ర నిధుల సాధనపై కొంత మంది మంత్రులు పెద్దగా ఆసక్తి చూపించడం లేదని అసంతృప్తి చూపించారు. ఢిల్లీకి వెళ్లి సంంధిత శాఖ మంత్రి, అధికారుల్ని కలిసి కేంద్ర పథకాల్లో భాగంగా రావాల్సిన నిధులను ఎప్పటికప్పుడు తెచ్చుకోవాలని సలహా ఇచ్చారు. ఇప్పుడు చంద్రబాబే ఆ బాధ్యత తీసుకుంటున్నారు.
ఈ పర్యటనలో రాజకీయ అంశాలపైనా చర్చ జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బీహార్ నేతను నియమించారు. ఈ క్రమంలో ఎన్డీఏలో కీలక మార్పులు, కూటమి సమన్వయం వంటి అంశాలపైనా అమిత్ షాతో చర్చించే అవకాశాలు ఉన్నాయి. ఏపీ రాజకీయ పరిణామాలపైనా కొన్ని కీలక విషయాలు అమిత్ షాతో చంద్రబాబు మాట్లాడే అవకాశాలు ఉన్నాయి.
