సామాజిక వేత్త, ఉద్యమ స్ఫూర్తి, ఆలోచనాపరుడు, మేధావి, రచయిత బిఎస్ రాములు ని తెలంగాణా ప్రభుత్వం బిసి కమీషన్ చైర్మన్ గా నియమించింది. సివిల్ కోర్టుకి వుండే అధికారాలు కమీషన్ కి వుంటాయి.
రాములు మాదిరిగా ఇండిపెండెంట్ గా వ్యవహరించగల సామాజిక వేత్తలను అధికార పదవుల్లో నియమించగల ఆలోచనగాని, ధైర్యం కానీ చంద్రబాబు ప్రభుత్వానికి లేదు. ఆ విధంగా ఎపికి బుద్ధిపూర్వకమైన సౌష్టవాన్ని ముఖ్యమంత్రి నీరుగార్చేస్తున్నారు
రాములు నియామకంలో కోదండరామ్ వంటి స్వతంత్ర ప్రవృత్తిగల వారి ప్రభావాన్ని తగ్గించాలన్న కెసిఆర్ రాజకీయ ఎత్తుగడ వుండవచ్చు. అయినా కూడా యోగ్యతను అందలం ఎక్కించిన కెసిఆర్ విజ్ఞతా వివేకాలను ఎవరూ తోసిపుచ్చలేరు.
అటువంటి దృష్టీ దృక్పధాలు తెలుగుదేశం అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకి లేవు. ఇకపై వస్తాయన్న ఆశకూడా లేదు.
సమాజాన్ని నిరంతరం చైతన్యవంతంగా, సవ్యంగా నడిపించడంలో కవులు, కళాకారులు, రచయితలు, మేధావులు, సామాజిక వేత్తల పాత్ర ప్రభావాలు వుంటాయి. అందరికీ కాకపోయినా ఆయా రంగాల నుంచి ఒకరినో ఇద్దరినో అధికార / నిర్ణాయక వ్యవస్ధలో భాస్వాములు చేయడం ప్రభుత్వానికే ప్రయోజనకరం. అది ప్రభుత్వ ప్రతిష్టను పెంచుతుంది. మేధోపరమైన సౌష్టవాన్ని ఇస్తుంది. అవసరమైనపుడు బ్రేకులు వేస్తుంది. అవసరమైతే ఉద్యమ సమయాల్లో మధ్యవర్తిత్వాన్ని నిర్వహిస్తుంది.
అయితే ఈ వర్గాలవారెవరూ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఇష్టపడరు. ఇష్టపడినా వారికి ఆర్ధిక వనరులు వుండవు. అయినా కూడా వారి సేవలు ప్రజలకు, పాలకపక్షం ప్రతిష్టకు ఉపయోగపడటానికే శాసన మండలి సభ్యత్వంతో సహా అనేక నామినేటెడ్ పదవులను రాజ్యాంగమే ఇచ్చింది.
చంద్రబాబుతో సహా ప్రజల్ని కేవలం ఓట్లు గానే చూడటానికి అలవాటు పడిపోయిన నాయకుల వల్ల ఆ అవకాశాలను కూడా ఓట్లు రాబట్టే కుల, ప్రాంత, సమీకరణలు, పార్టీ విధేయతలకే పరిమితం చేస్తున్నారు.
పారిశ్రామిక వేత్తలు, సంపన్నులు – ఒకవైపు, నాయకుడికి జైకొట్టడం తప్ప స్వతంత్రంగా ఆలోచించే వెన్నెముక లేనివారు, బడుద్దాయిలు మరోవైపు ప్రభుత్వాన్ని ఆక్రమించేస్తున్నపుడు వారి మధ్య ఇమడలేని ఇండిపెండెంట్ మేధావులు మౌనంగా వుండిపోతారు. ఫలితంగా ప్రభుత్వానికి మేధోపరమైన సౌష్టవం లోపిస్తుంది.
చంద్రబాబు పాలనలో ఈ లోపం ఎప్పటికీ కొనసాగుతూనే వుంటుంది. బౌద్ధికంగా ఆంధ్రప్రదేశ్ కు వున్న లోపాల్లో ఇది ప్రధానమైనది.