రూ.2వేల కోట్ల కాంట్రాక్టుల సిఎం ర‌మేష్‌… ఆ చానెల్ స్టోరీ వెనుక‌?

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మీడియా స్ప‌ష్టంగా రాజ‌కీయ పార్టీల వారీగా విభ‌జ‌న‌కు గుర‌య్యింది. అందులో వీస‌మెత్తు సందేహం ఎవ‌రికీ అక్క‌ర్లేదు. స‌హ‌జంగానే అత్య‌ధిక భాగం చానెళ్లు, అధికార పార్టీ చెప్పుచేత‌ల్లో న‌డుస్తుంటే, మిగిలిన చానెళ్ల‌ను త‌లా కాస్త అన్న‌ట్టుగా విప‌క్షాలు పంచుకుంటున్న విష‌యం రాజ‌కీయ ఓన‌మాలు దిద్దుకుంటున్న వారికి కూడా సుల‌భంగానే అర్ధ‌మ‌య్యే విష‌యం. ఇక ప్రింట్ మీడియా ప‌రిస్థితి కూడా దీనికి పెద్ద భిన్నంగా ఏమీ లేద‌నుకోండి.

అది అలా ఉంచితే… రెండ్రోజుల క్రితం తెలుగుదేశం రాజ్య‌స‌భ స‌భ్యుడు సి ఎం ర‌మేష్ మీద ఓ ప్రుమ‌ఖ‌ తెలుగు చానెల్ స్టోరీ ప్ర‌సారం చేసింది. తొలి నుంచీ సిఎం ర‌మేష్ ది సందేహాస్ప‌ద వ్య‌వ‌హార‌మేన‌ని, పార్టీ టిక్కెట్ల పంపిణీ ద‌గ్గ‌ర్నుంచీ అన్నింట్లో త‌న హ‌వా ఉండేలా చూసుకోవ‌డానికి ఆయ‌న త‌హ‌త‌హ‌లాడుతుంటాడ‌ని అందుకే తొలుత సిఎం చంద్ర‌బాబు ఈయ‌న్ని ప‌క్క‌న పెట్టారంటూ ప్రారంభ‌మైన ఆ క‌ధ‌నం త‌ర్వాత త‌ర్వాత సిఎం ర‌మేష్‌పై తీవ్ర‌మైన ఆరోప‌ణ‌లు గుప్పిస్తూ సాగింది.
తొలుత చంద్ర‌బాబు ద‌గ్గ‌ర బ్యాడ్ రిమార్క్ వ‌చ్చిన‌ప్ప‌టికీ, అంచెలంచెలుగా దాన్ని తొలగించుకుని సిఎం ర‌మేష్ త‌న ప్రాభ‌వాన్ని విస్త‌రించుకున్నాడంది. ముఖ్యంగా రాష్ట్రంలో ప్ర‌స్తుతం నిర్మిత‌మ‌వుతున్న‌ ఇరిగేష‌న్ ప్రాజెక్టుల్లో ప‌లు ఇరిగేష‌న్ కాంట్రాక్ట్‌లు సిఎం ర‌మేష్ కు చెందిన సంస్థ ద‌క్కించుకుంద‌ని వెల్ల‌డించింది. ఢిల్లీ స్థాయిలో పావులు క‌దిపి దాదాపు రూ.2వేల కోట్ల‌కు పైగానే విలువ చేసే కాంట్రాక్టులు ద‌క్కించుకున్న సిఎం ర‌మేష్‌… వాటిని పూర్తి చేసే విష‌యంలో మాత్రం అంత వేగాన్ని ప్ర‌ద‌ర్శించ‌డం లేద‌ని విమ‌ర్శించింది. ప్ర‌స్తుతం పోల‌వ‌రం ప్రాజెక్ట్ మీద కూడా ఆయ‌న క‌న్ను ప‌డిందంటూ ఆరోపించింది.

ఇలా సిఎం ర‌మేష్‌ను దునుమాడుతూ సాగిన ఆ చానెల్ క‌ధ‌నం… ఇప్పుడు టీడీపీలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. నిజానికి ఇవేవీ పార్టీలో తెలియ‌ని విష‌యాలు కావు. ఇదే స్టోరీ ఏ సాక్షి చానెల్‌లోనో వ‌చ్చి ఉంటే పెద్ద‌గా ప‌ట్టించుకోవ‌ల్సిన అంశ‌మూ కాదు. అయితే టీడీపీకి అనుకూల మీడియాగా చెప్పుకునే చానెల్‌లో వ‌చ్చిన ఈ స్టోరీ కాబ‌ట్టి దీనిపై చ‌ర్చ మొద‌లైంది. దీని వెనుక సిఎం ర‌మేష్ పొడ గిట్ట‌ని ప్ర‌త్య‌ర్ధులు ఉన్నార‌ని అంటున్నారు. ముఖ్యంగా పార్టీ వ్య‌వ‌హారాల్లో మితిమీరుతున్న ర‌మేష్ జోక్యాన్ని త‌గ్గించేందుకే ఈ స్టోరీని ఇప్ప‌టికిప్పుడు తెర‌మీద‌కు తెచ్చారంటున్నారు.

ఇరిగేష‌న్ ప్రాజెక్టుల‌కు చంద్ర‌బాబు ఓ వైపు ఎంతో ప్రాధాన్య‌మిస్తూన్నార‌ని, ప‌గ‌లూ రాత్రీ క‌ష్ట‌ప‌డుతున్నార‌ని, అయితే ర‌మేష్ లాంటి స్వార్ధ‌ప‌రుల వ‌ల్ల ఆయ‌న శ్ర‌మ నిష్ప‌ల‌మ‌వుతోంద‌ని అంటూ ప‌రోక్ష వ్యాఖ్య‌లు చేస్తూ క‌ధ‌నం సాగ‌డం వెనుక ముఖ్య నేత‌లే ఉన్నార‌ని టిడిపి వ‌ర్గాలు గుస‌గుస‌లాడుకుంటున్నాయి. నిజానికి స‌మ‌ర్ధులైన వ్య‌క్తుల‌కు కాంట్రాక్ట్‌లు అప్ప‌గించ‌డం, త్వ‌రిత‌గ‌తిన ప్రాజెక్టులు పూర్తి చేయ‌డం ప్ర‌భుత్వ బాధ్య‌త‌. ఈ విష‌యంలో ప‌క్ష‌పాత‌ర‌హితంగా వ్య‌వ‌హ‌రించాల్సిన బాధ్య‌త కూడా ప్ర‌భుత్వ పెద్ద‌ల మీద ఉంటుంది. ఇలా చేయ‌లేద‌నే అప్ప‌ట్లో వైఎస్ ప్ర‌భుత్వం మీద టిడిపి ధ‌న‌య‌జ్ఞం అంటూ విమ‌ర్శ‌లు సాగించింది.

ఈ నేప‌ధ్యంలో కొన్ని ప్రాజెక్టుల ఆల‌స్యానికి మూల కార‌ణాన్ని ఓ వ్య‌క్తి మీద‌కు నెట్టేసి, అదే స‌మ‌యంలో ప్ర‌భుత్వం మీద ఈగ వాల‌కుండా చూసేందుకు ఈ క‌ధ‌నం ప్ర‌య‌త్నించింద‌నేది సుస్ప‌ష్టం. క‌ర్ర విర‌క్కుండా పాముని కొట్టాల‌నే ప్ర‌యత్నం వెనుక ఉన్న పెద్ద‌లెవ‌రైనా… వారి ప్ర‌య‌త్నం ఎంత మేర‌కు ఫ‌లిస్తుందో రానున్న రోజుల్లో సిఎం ర‌మేష్ భ‌విత‌వ్యం సాక్షిగా తేల‌నుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.