కోకాపేట భూముల వివాదంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. శారదా పీఠానికి కేటాయించిన భూముల్ని ఆ పీఠానికే కేటాయించాలని నిర్ణయించారు. ఆ భూముల్ని జలమండలికి కేటాయిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని రెవిన్యూ శాఖను ఆదేశించారు. దీంతో ఈ వివాదం కీలక మలుపు తిరగింది.
విశాఖ శారదాపీఠానికి చెందిన స్వరూపానంద గతంలో కేసీఆర్కు అత్యంత సన్నిహితంగా ఉండేవారు. ఆయన కోసం హోమాలు చేశారు. దానికి ప్రతిఫలంగానో లేకపోతే మరో కారణమో కానీ అత్యంత ఖరీదైన కోకాపేట ప్రాంతంలో కేసీఆర్ రెండు ఎకరాలు ..కేవలం రూపాయి చొప్పున కేటాయించారు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ భూములను రద్దు చేసి ఉంటే సమస్య వచ్చేది కాదు. బీఆర్ఎస్ కార్యాలయం కోసం కేటాయించుకున్న భూముల్నిరద్దు చేశారు కానీ అప్పట్లో శారదాపీఠం భూముల జోలికి వెళ్లలేదు.
ఇటీవల జలమండలి అధికారులు నియోపొలిస్ ప్రాంతానికి నీటి సరఫరా కోసం చేయాల్సిన ఏర్పాట్ల కోసం ఆ భూమి కావాలని నివేదిక ఇచ్చారు. దాంతో కేబినెట్లో కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇప్పటికే అక్కడ ఆలయాల నిర్మాణం జరుగుతోంది. సగం మేర నిర్మించారు. ఇప్పుడు ఆ ఆలయాలను తొలగించడం మంచిది కాదన్న ఉద్దేశంతో రేవంత్ వెనక్కి తగ్గినట్లుగా తెలుస్తోంది.
ఇప్పటికే బీజేపీ నేతలు ప్రభుత్వం హిందూత్వంపై దాడి చేస్తోందని ఆరోపిస్తున్నారు. హరీష్ రావు.. శారదాపీఠానికి వెళ్లి వచ్చారు. రేవంత్ బావమరిది కోసమే ఖాళీ చేయిస్తున్నారని ఆరోపించారు. ఈ వివాదం అంతా ఎందుకని రేవంత్.. ఆ భూములు శారదాపీఠానికే కొనసాగించాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.
