తెలంగాణ ఉద్యమంలో జేఏసీ చైర్మన్గా కీలక పాత్ర పోషించిన కోదండరాం ఎమ్మెల్సీ పదవిపై బీఆర్ఎస్ కుట్ర చేసిందని.. ఢిల్లీ వరకూ వెఎళ్లి పెద్ద పెద్ద లాయర్లను పెట్టి ఆయన పదవిని పోయేలా చేసిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఉస్మానియాకు రేవంత్ వెళ్లారు. అక్కడ అభివృద్ధి పనుల కార్యక్రమాల్లో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా కోదండరాం ప్రస్తావన తీసుకు వచ్చారు. ఆయన పదవిపై బీఆర్ఎస్ కుట్ర చేసిందని.. మరో పది రోజుల్లోనే మళ్లీ ఎమ్మెల్సీని చేస్తానని ప్రకటించారు.
పది రోజుల్లో మళ్లీ ఎమ్మెల్సీగా చేయాలంటే.. మళ్లీ గవర్నర్ కోటాలోనే సిఫారసు చేయాల్సి ఉంటుంది. అలాగే సిఫారసు చేస్తారు. ఇప్పటికి రెండు సార్లు కోదండరాం పేర్లను సిఫారసు చేశారు. ఓ సారి ప్రమాణం చేయకముందే ఆగిపోయింది. మరోసారి ప్రమాణం చేశార.. రద్దు చేశారు. ఇప్పుడు మళ్లీ అలాగే సిఫారసు చేస్తే.. సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తుందన్నది కూడా కీలకమే. కోదండరాంను అవమానిస్తున్నారన్న అభిప్రాయం తెలంగాణ ఉద్యమకారుల్లో ఏర్పడుతోంది. అందుకే రేవంత్ ఈ ప్రకటన చేసినట్లుగా భావిస్తున్నారు.
సాధారణంగా పదవిలో ఉన్న ముఖ్యమంత్రి ఉస్మానియాకు వెళ్లేందుకు ఆసక్తి చూపించరు. అదో సెంటిమెంట్. ఇప్పుడు రేవంత్ వెళ్లారు. ఇప్పుడు అధికారిక కార్యక్రమాల కోసం వచ్చానని డిసెంబర్ లో విద్యార్థుల కోసం వస్తానని ప్రకటించారు. ఒక్క పోలీసు కూడా ఉండకుండా విద్యార్థులతో మాట్లాడతానని ప్రకటించారు. విద్యార్థుల డిమాండ్ల మేరకు అక్కడికక్కడే జీవోలు జారీ చేస్తానని కూడా చెప్పారు. ప్రస్తుతం.. ఉస్మానియాకు వెయ్యికోట్లు మంజూరు చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఉస్మానియాను ఆక్స్ ఫర్డ్ స్థాయిలో అభివృద్ధి చేస్తామని ప్రకటించారు.