ఉస్మానియా యూనివర్సిటీలో సీఎం రేవంత్ సమావేశం పెట్టారు. విద్యార్థులను , బోధనా, బోధనేతర సిబ్బంది అందర్ని ఆహ్వానించారు. గతంలో ఓయూకు వచ్చినప్పుడు ప్రత్యేకంగా ఓయూ అభివృద్ధి కోసం సమావేశం పెడతానని ప్రకటించారు. అందులో భాగంగా ఆయన బుధవారం సమావేశం పెట్టారు. ఇలా ఓ సీఎం నేరుగా ఓయూలో సమావేశం పెట్టడం అరుదు. కేసీఆర్ వల్ల కూడా కాలేదు.
తెలంగాణ ఉద్యమంలో ఓయూ క్యాంపస్ ఎప్పుడూ రగిలిపోతూ ఉండేది. బీఆర్ఎస్ కు ఏకపక్ష మద్దతు లభించేది. అలాంటిది తెలంగాణ ఏర్పాటు తర్వాత కేసీఆర్ కూడా ఆ క్యాంపస్ కు వెళ్లలేకపోయారు. ఒకటిరెండు సందర్భాల్లో వెళ్లాల్సి వచ్చినా.. వేరే దారిని ఏర్పాటు చేసి వచ్చి వెళ్లారు కానీ అది విద్యార్థులతో సమావేశాలకు కాదు. కానీ రేవంత్ మాత్రం.. నేరుగా విద్యార్థులతో సమావేశయ్యారు. ఈ విషయాన్ని రేవంత్ కూడా గుర్తు చేసుకున్నారు. ఓయూలో మంత్రులు, సీఎంలను అడ్డుకునే చరిత్ర ఉంది, మీరెందుకు వెళ్తున్నారని తనను చాలా మంది అడిగారన్నారు. మీరు చాలా ధైర్యం చేస్తున్నారని కొందరు అన్నారు.. నాది ధైర్యం కాదు, అభిమానం.. నా తమ్ముళ్లు ఉన్న యూనివర్సిటీకి వెళ్లేందుకు ధైర్యం అవసరమా.. గుండెల నిండా అభిమానంతో భవిష్యత్ ప్రణాళిక కోసం ఇక్కడికి వెళ్తున్నాని చెప్పానన్నారు.
రేవంత్ ఉస్మానియాకు వెళ్లడానికి ముందు రోజే.. యూనివర్శిటీ అభివృద్ధికి రూ. వెయ్యి కోట్లు విడుదల చేస్తూ జీవో ఇచ్చారు. అదే సమయంలో అభివృద్ధికి సమగ్రమైన ప్రణాళికలు, వీడియోలు కూడా విడుదల చేశారు.దీంతో విద్యార్థుల్లో సంతృప్తి వ్యక్తమయింది. ఎలాంటి నిరసనలు జరగకపోవడం బీఆర్ఎస్ వర్గాలను నిరాశపరిచింది.అయితే విద్యార్థి నేతల్ని ముందస్తుగానే అరెస్టు చేశారని వారు ఆరోపిస్తున్నారు.