ఓ ముఖ్యమంత్రే చట్టాలు ఏమీ పట్టించుకోవద్దు.. ఇష్టారితీన చేసేయండి అని చెప్పి నేరుగా చెపించేస్తే.. ఆయనకు ఆ పదవిలో ఉండే అర్హత ఉంటుందా ? ఆయన రాజ్యాంగం ప్రకారం … ముఖ్యమంత్రి అయ్యారు. ఆ రాజ్యాంగం ప్రకారం పరిపాలన చేయకుండా ఇష్టారీతిన చేసుకుందామని ముందుకెళ్తే ఆయనకు పదవిలో ఉండే అర్హత ఎలా ఉంటుంది. రుషికొండ విషయంలో జరుగుతోంది అదే. రుషికొండలో పర్యావరణ విధ్వంసం జరిగింది. అనుమతులకు మించి విధ్వంసం జరిగింది. పర్యావరణ చట్టాలను పట్టించుకోలేదు. ఆ విషయంలో కేంద్ర కమిటీ దర్యాప్తులో స్పష్టమయింది.
అసలు ఇంత అరాచకం సృష్టించడానికి కారణం సీఎం జగన్,. అక్కడ ఆయన క్యాంప్ ఆఫీసు కట్టుకోవాలనుకున్నారు. అంతే.. రంగంలోకి దిగిపోయారు. ప్రభుత్వ పెద్ద చెబుతున్నారు కదా అని అధికారులంతా ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. తవ్వి పడేశారు. అనుమతుల్లేకుండా నిర్మాణాలు చేశారు. రుషికొండలో తవ్విన వాటిని సముద్రంలో పడేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే.. ఓ అధికార వ్యవస్థ ఇంత బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించగలదా అని ఎవరికైనా అనుమానం రాక మానదు. కానీ ఏపీలో జరిగింది అదే. నేర ప్రవృత్తి ఉన్న వారు.. పరిపాలన చేస్తే ఎంత భయంకరంగా ఉంటుందో అలాంటి పరిస్థితి రుషికొండ విధ్వంసంలో కనిపిస్తోంది.
రుషికొండ లో జరిగిన విధ్వంసంలో హైకోర్టు అధికారులదే తప్పని తేల్చవచ్చు. ఎందుకంటే… రాజకీయ నాయకులుఎన్ని అయినా చెప్పవచ్చు కానీ నిబంధనల ప్రకారమే నిర్ణయాలు ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. నిబంధనల ప్రకారం ఉంటేనే సంతకాలు చేయాలి.. పనులు ప్రారంభించాలి, ఇక్కడ తప్పంతా అధికారులదే అవుతుంది. రాజకీయ నేతలు.. సీఎం నోటి మాట ద్వారా ఆదేశాలు ఇచ్చి ఉండవచ్చు. కానీ అదంతా అనధికారికం.
ఉద్యోగుల్ని.. అధికారుల్ని బలి చేసి.. తాను పదవిలో ఉండటం నైతికం కాదు. తన నిర్ణయాలను తాను ధైర్యంగా ఒప్పుకోవాల్సి ఉంటుంది. కానీ అలాంటి నైతిక రాజకీయాలకు ఈ ప్రభుత్వంలో కాలం చెల్లింది. మరి కోర్టు ఏం చేయబోతోందో చూడాల్సి ఉంది.