గత ఏడాది ఓటుకి నోటు కేసు నుంచి ఎలాగో అతికష్టం మీద బయటపడిన తరువాత అప్పుడపుడు జగన్, ముద్రగడ నిరాహార దీక్షలు, కేంద్రప్రభుత్వం, భాజపా నేతలతో చిర్రుబుర్రులు తప్ప ఈ మద్య కాలంలో తెదేపా ప్రభుత్వం పెద్దగా ఇబ్బందిపడలేదనే చెప్పవచ్చు. కానీ ఓటుకి నోటు కేసులో మళ్ళీ కదలిక రావడంతో తెదేపాకి గడ్డు రోజులు మొదలైనట్లే కనిపిస్తున్నాయి. కృష్ణా పుష్కరాలు చాలా అద్భుతంగా చేసిన సంతోషం పూర్తిగా అనుభవించకముందే మళ్ళీ ఓటుకి నోటు కేసులో కదలిక రావడంతో ఆ సంతోషం అంతా ఆవిరైపోయిందనే భావించవచ్చు.
అది కాక కాపులకి రిజర్వేషన్లు కోసం ముద్రగడ పద్మనాభం, ప్రత్యేక హోదా కోసం పవన్ కళ్యాణ్ మొదలుపెట్టబోయే ఉద్యమాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కోవలసి ఉంటుంది. పవన్ కళ్యాణ్ కారణంగా తెదేపాపై మరింతః ఒత్తిడి పెరుగుతుంది కనుక ప్రత్యేక హోదా తదితర హామీలపై కేంద్రప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకోవలసిన సమయం కూడా దగ్గర పడింది. కానీ ఓటుకి నోటు కేసులో మళ్ళీ కదలిక వచ్చినందున ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రప్రభుత్వంతో కయ్యానికి కాలుదువ్వే పరిస్థితి లేదు. అలాగని పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా కోసం పోరాడుతుంటే తెదేపా చేతులు ముడుచుకొని కూర్చోలేదు.
ఈ ఓటుకి నోటు కేసు, రెండు ఉద్యమాల కారణంగా ఒకవేళ తెదేపా ఏమాత్రం బలహీనంగా కనిపించినా కాంగ్రెస్ పార్టీ, వైకాపాలు ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని తెదేపాని మరింత ఒత్తిడికి గురిచేసి దెబ్బ తీసే ప్రయత్నాలు చేసినా ఆశ్చర్యం లేదు. ఇక తెలంగాణా ప్రభుత్వం నుంచి నిత్యం ఉండే సమస్యలు సవాళ్లు ఎప్పుడూ ఉండనే ఉంటాయి. ఇవికాక తెదేపా ప్రభుత్వానికి రాజధాని నిర్మాణమనే ఒక (స్విస్) చాలెంజ్ ఉండనే ఉంది. కనుక తెదేపాకి మున్ముందు గడ్డురోజులు మళ్ళీ మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.