తెలుగు రాష్ట్రాల మధ్య మళ్లీ రాజకీయ వేడి పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి! గడిచిన కొన్ని నెలలలుగా ఆంధ్రా, ఏపీ సర్కారులకు చెందిన అధికార పార్టీ నాయకుల మధ్య పెద్దగా వాగ్యుద్ధాలు, విమర్శల పర్వాలు లేవు. ఓటుకు నోటు కేసులో రాజీ కుదిరాక వాతావరణం అంతా దాదాపు సైలెంట్ అయిపోయింది. విభజన తరువాత జరగాల్సిన పంపకాల విషయంలో తప్ప, రాజకీయంగా ఇతర అంశాలపై రెండు పార్టీల మధ్య మాటలు విసురుకునే సందర్భాలు బాగా తగ్గిపోయాయి. కానీ, తాజా పరిణామాలు చూస్తుంటే తెరాస-టీడీపీల వాగ్యుద్ధాలకు తెర లేస్తున్నట్టుగా అనిపిస్తోంది.
రాష్ట్ర విభజన విషయంలో ఎప్పుడూ అసంతృప్తి వ్యక్తం చేస్తుంటారు చంద్రబాబు! విభజన జరిగిన తీరు బాలేదనీ, ఏపీని అనామకంగా రోడ్డున పడేశారనీ, కట్టుబట్టలతో పంపించేశారని తరచూ చెబుతూ ఉంటారు. అయితే, ఎప్పటికప్పుడు తెలంగాణ ప్రజలను కించపరచే విధంగా చంద్రబాబు మాట్లాడుతూ ఉంటారంటూ కస్సుమంటున్నారు తెలంగాణ ముఖ్య నేతలు. తెలంగాణ ప్రజలను ఉద్దేశించి ఏపీ సీఎం వ్యాఖ్యానిస్తున్న తీరు అభ్యంతరకంగా ఉంటోందని మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉందామని అనుకుంటే ఆ స్ఫూర్తికి చంద్రబాబు గండికొడుతున్నారంటూ ఈటెల విమర్శించారు. తెలంగాణలో కేసీఆర్ మాదిరిగా ఆంధ్రాలో కూడా తమకూ మరో కేసీఆర్ ఉంటే బాగుంటుందని ప్రజలు ఆకాంక్షిస్తున్నారని ఈటెల చెప్పారు.
ఎంపీ కవిత కూడా చంద్రబాబు ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. విభజన గురించి చంద్రబాబు చేసిన వ్యాఖ్యల్ని ఖండిస్తున్నా అంటూ ఆమె విమర్శించారు. తెలంగాణపై విషయం చిమ్ముతూ తన పక్షపాత బుద్ధిని మరోసారి బయటపెట్టుకున్నారంటూ ఆమె మండిపడ్డారు. ఆది నుంచీ తెలంగాణ ద్రోహిగానే ఆయన వ్యవహరిస్తున్నారనీ, ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ దుకాణం సర్దుకుని వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందని కవిత వ్యాఖ్యానించారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉండేందుకు అర్హతను కోల్పోయిందని ఆమె మండిపడ్డారు.
చాలారోజుల తరువాత చంద్రబాబుపై ఇలాంటి విమర్శలు చేస్తోంది తెరాస! మరి, ఈ వ్యాఖ్యలకు ఏపీ టీడీపీ నుంచి ఎవరో ఒకరు కౌంటర్ ఇవ్వకుండా ఉంటారా..! ఆ తరువాత తెరాస నేతలు మరోసారి మాట్లాడకుండా ఉంటారా..? వాతావరణం చూస్తుంటే మరోసారి రాష్ట్రాల అధికార పార్టీల మధ్యా కామెంట్స్ హీట్ పెరిగే అవకాశం కనిపిస్తోంది. మరి, దీని వెనక ఎవరి వ్యూహాలు ఏంటో.. ఎవరి ప్రయోజనాలు ఏంటో అనేవి ఇంకా తెలియాల్సి ఉంది.