తెలంగాణ కాంగ్రెస్ లో అంతర్గత ప్రజాస్వామ్య స్వేచ్చను ఇష్టానుసారంగా ఉపయోగించుకునేవాళ్లు ఎక్కువ అయిపోతున్నారు. వారందరినీ క్రమశిక్షణ కమిటీ బుజ్జగిస్తోంది. నిజానికి వారు క్రమశిక్షణ ఉల్లంఘిస్తే చర్యలు తీసుకోవాలి. కానీ అలాంటి పనులు చేయలేకపోతున్నారు. ఎంత బతిమాలినా.. తీన్మార్ మల్లన్న ఇంకా ఇంకా రెచ్చిపోవడంతో పరువు పోతుందని సస్పెండ్ చేశారు. కానీ ఇతర నేతల్ని మాత్రం బుజ్జగిస్తున్నారు.
చాలా రోజుల పెండింగ్ తర్వాత కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ గాంధీభవన్లో సమావేశం అయింది. కొండా మురళి అంశంతో పాటు రాజగోపాల్ రెడ్డి అంశంపై చర్చించేందుకు కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. కొండా మురళీ కూడా సమావేశానికి వచ్చారు. సమావేశం తర్వాత కొండా మురళి వివాదం ముగిసిందని ప్రకటించారు. మల్లు రవి ఆదేశాలను పాటిస్తామని..అందరం కలసికట్టుగా పని చేసి స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తామన్నారు. తాము ఇతర పార్టీల్లో ఇమడలేదని.. తమకు కాంగ్రెస్సే కరెక్టన్నారు.
కానీ ఇతర నేతలు మాత్రం.. వారో తామో తేల్చుకోవాలని అంటున్నారు. ఇక మిగతా నేతల్ని బుజ్జగించాల్సిన అవసరం క్రమశిక్షణా కమిటీకి ఏర్పడింది. ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై ఏం చేస్తారో స్పష్టత లేదు. ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలన్న డిమాండ్ ఉంది. కనీసం వివరణ అడిగినా ఆయన ఇంకా వివాదాన్ని పెద్దది చేస్తారని.. ఆయన సోదరుడు.. వెంకటరెడ్డితో చెప్పించి సరి పెట్టాలన్న ఆలోచన చేస్తున్నారు. కాంగ్రెస్ లో పార్టీ నేతలపై చర్యలు తీసుకోవడం కూడా అంత తేలిక కాదని అనుకోవాలి.