స్వాతంత్ర్యదినోత్సవ సందర్భంగా కాశ్మీర్ లో మళ్ళీ నిన్న ఆందోళనకారులు రెచ్చిపోవడంతో నలుగురు మృతి చెందారు. మళ్ళీ అనేకమంది గాయపడ్డారు. కాశ్మీర్ అల్లర్లని అదుపులోకి తేవడానికి కాంగ్రెస్ పార్టీ కూడా మోడీ ప్రభుత్వానికి సహకరిస్తుండటం చాలా హర్షణీయం. ఆ రెండు పార్టీల మధ్య రాజకీయ విభేదాలు, వివిధ అంశాలపై భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ కాశ్మీర్ విషయంలో కాంగ్రెస్ పార్టీ కేంద్రప్రభుత్వానికి బేషరతుగా మద్దతు ప్రకటించడం చాలా మంచి పరిణామం. హర్షణీయం.
అదేవిధంగా బలూచిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ప్రజలకి భారత్ మద్దతు ప్రకటించాలనే ప్రధాని మోడీ ప్రతిపాదనకి కాంగ్రెస్ పార్టీ మద్దతు పలుకడం హర్షణీయం. అందువల్లే ప్రధాని నరేంద్ర మోడీ నిన్న ఎర్రకోటపై నుంచి మారిన భారత్ వైఖరిని ప్రపంచానికి ఎలుగెత్తి చాటారు.
భారత్ అనుసరిస్తున్న ఈ సరికొత్త విధానం మున్ముందు ఎటువంటి ఫలితాలు ఇస్తుందో, ఏ పరిణామాలకి దారి తీస్తుందో కాలమే చెపుతుంది. కానీ అంతకంటే ముందు కాశ్మీర్ లో కొనసాగుతున్న అల్లర్లకి తక్షణమే కళ్ళెం వేయవలసి ఉంటుంది. లేకుంటే కాశ్మీర్ లో మానవహక్కుల ఉల్లంఘన జరుగుతోందనే పాకిస్తాన్ వాదనకి బలం చేకూరుతుంది. నిజానికి ఆవిధంగా జరిగి ప్రపంచ దేశాల దృష్టి కాశ్మీర్ పై పడాలని, అప్పుడు అవి కాశ్మీర్ సమస్యలో జోక్యం చేసుకోవలసిన అనివార్య పరిస్థితులు కల్పించాలనే ఉద్దేశ్యంతోనే పాకిస్తాన్, దాని ఉగ్రసంస్థలు కాశ్మీర్ లో అల్లర్లని ప్రేరేపిస్తున్నాయేమోననే అనుమానం కలుగుతుంది. కనుక వాటికి తక్షణమే కళ్ళెం వేయడానికి అవసరమైన ప్రతీ ఉపాయాన్ని అమలుచేయడం చాలా అవసరమే.
ఇక భారత రక్షణమంత్రి మనోహర్ పారిక్కర్ “పాకిస్తాన్ ఒక నరకం అని, పాకిస్తాన్ వెళ్ళడం అంటే నరకానికి వెళ్ళడమే”నని చాలా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన పాకిస్తాన్ లోని పరిస్థితుల గురించి చెప్పిన మాట నూటికి నూరు శాతం నిజమేనని, ఆ దేశం గురించి బాగా తెలిసినవారు ఒప్పుకొంటారు. కానీ ఒక దేశం మరొక దేశం గురించి బహిరంగంగా ఇటువంటి అభిప్రాయం వ్యక్తం చేయడం వలన ఆ దేశప్రజల మనసులు చాలా గాయపడతాయి. అదే భారత్ పట్ల వ్యతిరేకతకి దారి తీస్తుంది కనుక ఇటువంటి అనుచిత వ్యాఖ్యలకి దూరంగా ఉండటం కూడా చాల అవసరం. కానీ అదేసమయంలో పాకిస్తాన్ ప్రభుత్వాన్ని, దాని ఉగ్రవాద సంస్థలని, వేర్పటువాదులని సమర్ధంగా ఎదుర్కోవడానికి బలూచిస్తాన్ వంటి ఉపాయాలు అనుసరించడం చాలా అవసరమే.