బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని కామారెడ్డిలో డిక్లరేషన్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు అదే కామారెడ్డిలో సభ పెట్టి బీసీ రిజర్వేషన్లకు బీజేపీ అడ్డుపడుతోందని ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల పదిహేనో తేదీన కామారెడ్డిలో బహిరంగసభ ఏర్పాటు చేశారు. దీనికి బీసీ డిక్లరేషన్ విజయోత్సవ సభ అని నామకరణం చేశారు. బీసీ డిక్లరేషన్ చెప్పినవి చెప్పినట్లుగా అమలు చేశామని కాంగ్రెస్ చెప్పుకోవాలని తాపత్రయపడుతోంది. అందులో భాగంగానే ఈ సభ ఏర్పాటు చేశారు.
అయితే బీసీ రిజర్వేషన్లు ఎక్కడ ఇచ్చారు అన్నది ప్రధానంగా అందరికీ వచ్చే సందేహం. అందుకే ఆ నింద బీజేపీపై వేసి.. తాము చేయాలనుకున్నదంతా చేశామని.. కానీ బీజేపీ అడ్డుకుందని ప్రచారం చేయనున్నారు. ఇంత మాత్రం దానికి విజయోత్సవ సభ అని పేరు పెట్టడం కాస్త వింతగా ఉన్నా.. కాంగ్రెస్ పార్టీకి అంత కన్నా మార్గం లేనట్లుగా ఉంది. బీసీ రిజర్వేషన్ల సమస్య కారణంగానే స్థానిక ఎన్నికలు నిర్వహించలేకపోతున్నారు. పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు పోదామని అనుకున్నా యూరియా సమస్య వచ్చి పడటంతో వెనక్కి తగ్గాల్సి వస్తోంది.
బీసీ రిజర్వేషన్లు ఇవ్వడం తమ చేతుల్లో లేదు అని తెలిసినా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో గెలుపు కోసం రిజర్వేషన్లు ఇచ్చి తీరుతామని ప్రకటించింది. ఇపుడు ఇప్బందులు పడుతోంది. ఆ సమస్యను బీజేపీపై నెట్టేయడానికి ఢిల్లీలోనూ ధర్నాలు చేశారు. అయితే ప్రజలు హామీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాబట్టి.. చేయాలని కోరుకుంటారు కానీ.. కారణాలు చెప్పాలని అనుకోరు. కానీ కాంగ్రెస్ కు అంతకు మించిన మార్గం లేదు.