జూబ్లిహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా చిన్న శ్రీశైలం యాదవ్ కుమారుడు నవీన్ యాదవ్ ను కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసింది. ఉపఎన్నిక ఖరారు అయినప్పుడే రేవంత్ రెడ్డి క్యాంపు నుంచి నవీన్ యాదవ్ కు సంకేతాలు వెళ్లాయి. నియోజకవర్గంలో పని చేసుకోవాలని సూచించారు. అయితే పోటీకి చాలా మంది ప్రయత్నించారు. అందర్నీ రేవంత్ రెడ్డి ప్రణాళికాబద్ధంగా పక్కకు తప్పించారు. నవీన్ యాదవ్ కు టిక్కెట్ ఖరారు చేయించారు. ప్రకటనకు ముందు ఓటర్ కార్డుల పంపిణీ వివాదంలో కేసు నమోదు కావడం.. ఓటు చోరీపై రాహుల్ ప్రచారం చేస్తున్న కారణంగా ఆలోచిస్తారేమో అనుకున్నారు. కానీ కాంగ్రెస్ రిస్క్ తీసుకోలేదు.
నవీన్ యాదవ్ కు మజ్లిస్ మద్దతు
నవీన్ యాదవ్ అభ్యర్థిత్వానికి ప్రధానంగా మజ్లిస్ నుంచి మద్దతు లభించింది. గతంలో మజ్లిస్ నాయకుడే నవీన్ యాదవ్. ఆయన కుటుంబానికి వ్యక్తిగత బలం ఉంది. ఇండిపెండెంట్గా పోటీ చేసి బలమైన పోటీ ఇవ్వగలరు. అటు మజ్లిస్ మద్దతు.. ఇటు సొంత బలం కూడా ఉండటంతో ఆయనకు టిక్కెట్ ఖరారు చేయడంలో కాంగ్రెస్ హైకమాండ్ ఎలాంటి వేరే ఆలోచనలు చేయలేదు. జూబ్లిహిల్స్ లో కాంగ్రెస్ పార్టీకి ఉన్న బలం..డిపాజిట్ తెచ్చుకోవడానికి సరిపోతుంది. గెలవడానికి సరిపోదు. అన్ని సమీకరణాలు కలసి వస్తేనే గెలుపు. ఆ సమీకరణాలన్నీ నవీన్ యాదవ్ తో కలసి వస్తాయి.
వ్యక్తిగత బలం కూడా ప్లస్
చిన్న శ్రీశైలం యాదవ్ కుటుంబం ఒకప్పుడు రౌడియిజం చేసేదని అందరికీ తెలుసు.కానీ తర్వాత రాను రాను రౌడీయిజానికి చెక్ పడింది. ఆ కుటుంబంపై ఇమేజ్ అలాగే ఉంది. అందుకే ఇతర పార్టీలు వారిని పార్టీల్లో చేర్చుకునే ప్రయత్నం చేయలేదు. కానీ మజ్లిస్ ఎప్పుడూ అలా అనుకోలేదు. చాన్స్ ఉన్నప్పుడు టిక్కెట్ ఇచ్చింది. లోపాయికారీ ఒప్పందాల్లో పోటీ చేయనప్పుడు అవకాశం ఇవ్వలేదు. వారిపై ఒవైసీకి సాఫ్ట్ కార్నర్ ఉంది. అందుకే నవీన్ కు టిక్కెట్ ఇస్తే పోటీ చేయబోమని పరోక్షంగా మద్దతు ఇస్తామని సంకేతాలు ఇచ్చారు.
మైనార్టీ ఓటర్లే కీలకం
జూబ్లిహిల్స్ లో 90వేలకుపైగాఉన్న మైనార్టీలకు ఓట్లు విజేతను నిర్ణయిస్తాయి. ఆ వర్గాల్లో నవీన్ యాదవ్ కుటుంబానికి పట్టు ఉంది. మజ్లిస్ మద్దతు ఇస్తే వారు వేరే పార్టీకి ఓటు వేసే అవకాశం ఉండదు. అందుకే నవీన్ యాదవ్ అభ్యర్థి అయితే కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమని ముందు నుంచీ ఓ ప్రచారం ఉంది. అందుకే అభ్యర్థిత్వం కలసి వచ్చింది. ఇప్పుడు బీఆర్ఎస్ మరింత కష్టపడాల్సిందే.