ప్రాణభిక్ష పెట్టమని బ్రిటిష్ వాళ్ళను బ్రతిమాలుకొన్నవాడు ఆర్ఎస్.ఎస్. సిద్దాంత కర్తా?

ప్రభుత్వాలు ప్రజా సమస్యలను పరిష్కరించడంలో అశ్రద్ద చూపుతున్నట్లయితే, వాటిని ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేయవలసిన బాధ్యత ప్రతిపక్షాలపైనే ఉంటుంది. కానీ దేశంలో  ప్రతిపక్షాలు ప్రభుత్వం చేసే ప్రతీ పనినీ తప్పు పడుతూ, ప్రభుత్వాలను నడిపిస్తున్న వారిని వ్యక్తిగత స్థాయిలో విమర్శించడమే తమ బాధ్యత అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయి. ప్రజలకు, దేశానికి కూడా ఏమాత్రం ఉపయోగపడనీ అంశాలను వెలికి తీసి విమర్శలు చేసుకొంటూ కాలక్షేపం చేస్తుంటాయి. అందుకు ఉదాహరణంగా కాంగ్రెస్ పార్టీ ఆర్.ఎస్.ఎస్.పై ట్వీటర్ లో పోస్ట్ చేసిన ఈ తాజా విమర్శను చెప్పుకోవచ్చును.

“భగత్ సింగ్ దేశ స్వాత్రంత్ర్యం కోసం బ్రిటిష్ వాళ్ళని ఎదిరించినందుకు ఉరి శిక్ష పొందితే, సావర్కర్ తనకు ప్రాణభిక్ష పెట్టమని బ్రిటిష్ వాళ్ళను బ్రతిమాలుకొన్నాడు. అటువంటి వ్యక్తి రూపొందించిన మార్గదర్శకాల ప్రకారం ఆర్.ఎస్.ఎస్. పనిచేస్తుంది. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం జాతిపిత మహాత్మా గాంధీ చూపిన మార్గంలో ముందుకు సాగుతోంది,” అని కాంగ్రెస్ పార్టీ మెసేజ్ పెట్టింది.

స్వాతంత్ర్య పోరాట యోధులలో వీర సావర్కర్ కూడా ఒకరు. కనుక దేశ ప్రజల దృష్టిలో ఆయనకి చాలా గౌరవనీయమయిన స్థానం ఉంది. ఆనాడు ఆయన బ్రిటిష్ వాళ్ళని ప్రాణభిక్ష పెట్టమని బ్రతిమాలారో లేదో ఎవరికీ తెలియదు. కానీ బ్రతిమాలారని కాంగ్రెస్ పార్టీ చెపుతోంది. రాజకీయ పార్టీలు ఒకదానినొకటి దెబ్బ తీసుకొనే ప్రయత్నంలో దేశం కోసం పోరాడిన మహనీయుల గురించి ఈవిధంగా పనిగట్టుకొని దుష్ప్రచారం చేయడం చాలా తప్పు. దేశాభివృద్ధి గురించి, ప్రజా సమస్యల పరిష్కారం గురించి ఎటువంటి ప్రయత్నాలు చేయకుండా, మహనీయులను కించపరిచే విధంగా ఇటువంటి అనవసరమయిన విషయాల గురించి వాదోపవాదాలు చేయడం చాలా దురదృష్టకరమే. దేశంలో రాజకీయ పార్టీలు నానాటికీ దిగజారిపోతున్నాయని చెప్పడానికి ఇదే ఒక మంచి ఉదాహరణ. మహాత్మా గాంధీ చూపిన మార్గంలో నడుస్తున్నామని కాంగ్రెస్ పార్టీ గొప్పగా చెప్పుకొంటునప్పుడు, ఇతరుల గురించి ఈవిధంగా నీచంగా ఎందుకు మాట్లాడుతోంది. ఆయన తన శత్రువులను కూడా ప్రేమించమని కోరేవారు. కానీ కాంగ్రెస్ పార్టీ స్వాతంత్ర సమారా యోధులను కూడా విడిచి పెట్టకుండా వారి పట్ల కూడా అనుచితంగా మాట్లాడుతోంది. కాంగ్రెస్ హయంలో ఎంత అవినీతి జరిగిందో, ఎన్ని కుంభకోణాలు బయటపడ్డాయో అందరికీ తెలుసు. కాంగ్రెస్ పార్టీ ఇతరులను, ఇతర పార్టీలని, ప్రభుత్వాన్ని నిందిస్తూ ప్రజలను ఆకట్టుకొనే ప్రయత్నం చేసే బదులు, తన తప్పులను, లోపాలను సరిదిద్దుకొనే ప్రయత్నం చేస్తే బాగుంటుంది కదా?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com