బహిరంగసభలు పెట్టి కాంగ్రెస్ పార్టీ తోలు తీస్తామని కేసీఆర్ ప్రకటించి రెండు వారాలు అయింది. ఇప్పటి వరకూ బహిరంగసభలు ఎప్పుడో తేదీలు ఖరారు చేయలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం దూకుడుగా ఉంది. తేదీలను ఖరారు చేసుకుంది. వచ్చే నెల మూడో తేదీన పాలమూరులో ప్రారంభించి తొమ్మిది ఉమ్మడి జిల్లాల్లో బహిరంగసభలకు ప్లాన్ చేశారు. ములుగు జిల్లో బహిరంగసభకు సోనియాకు ఆహ్వానించాలని నిర్ణయించారు. ఈ సభల బాధ్యతను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఇచ్చారు.
సీఎం రేవంత్ రెడ్డి ఈ బహిరంగసభలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ బహిరంగసభలు ముగిసిన వెంటనే మున్సిపల్ ఎన్నికల నోటిఫికేష్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటి వరకూ తాము చేసిన పనులు, అమలు చేసిన పథకాలతో పాటు బీఆర్ఎస్ ప్రచారం చేస్తున్న అంశాలపైనా ప్రజలకు ఈ సభల్లో వివరించనున్నారు. బీఆర్ఎస్ పార్టీ జల వివాదాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సభలు ఏర్పాటు చేస్తామని చెప్పింది కానీ ఇంకా కార్యాచరణ ఖరారు చేసుకోలేదు.
సంక్రాంతి పండుగ సమయం వచ్చింది. ఇరవయ్యో తేదీ వరకూ పండుగ హడావుడి గ్రామాల్లో ఉంటుంది. ఆ తర్వాత పది రోజుల వ్యవధిలో సభలు నిర్వహించాల్సి ఉంటుంది. లేకపోతే కాంగ్రెస్ సభలతో క్లాష్ అవుతాయి. ఇప్పటి వరకూ బహిరంగసభలపై.. పార్టీ నేతలతో కేసీఆర్ ఒక్క సారి మాత్రమే చర్చించారు. తేదీలు, బహిరంగసభల వేదికలపై ఇంకా నిర్ణయం రాలేదు. ప్రస్తుత పరిస్థితి చూస్తూంటే ముందుగా కాంగ్రెస్ బహిరంగసభలను పూర్తి చేసే అవకాశం కనిపిస్తోంది.
