తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తిని రేపుతున్నాయి. సుమారు 35కు పైగా మున్సిపాలిటీల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో హంగ్ ఏర్పడింది. అయితే, ఈ అనిశ్చితిలోనూ అధికార కాంగ్రెస్ పార్టీయే పైచేయి సాధించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మెజారిటీకి అతి సమీపంలో నిలిచిన పురపాలికల్లో స్వతంత్రులుగా గెలిచిన అభ్యర్థులు నిర్ణయాత్మక శక్తిగా మారారు. వీరిలో అత్యధికులు కాంగ్రెస్ రెబల్స్ కావడమే ఆ పార్టీకి కలిసివచ్చే ప్రధానాంశం. తమ సొంత గూటికి చేరుకోవడానికి లేదా అధికారం కోసం ప్రభుత్వానికి మద్దతు తెలపడానికి వీరు సిద్ధంగా ఉండటంతో, హంగ్ మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమనిపిస్తోంది.
మెజారిటీకి ఇంకా సీట్లు తక్కువ పడే చోట్ల కాంగ్రెస్ పార్టీ తన ఎక్స్ అఫీషియో సభ్యుల అస్త్రాన్ని ప్రయోగించనుంది. మ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలకు ఉండే ఓటు హక్కును వినియోగించుకోవడం ద్వారా పలు పురపాలికల్లో పీఠాన్ని దక్కించుకోవాలని వ్యూహరచన చేస్తోంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా గెలిచిన స్థానాలకు తోడు, హంగ్ ఏర్పడిన చోట్ల స్వతంత్రుల మద్దతు , ఎక్స్ అఫీషియో ఓట్లతో కలిపి సుమారు 100కు పైగా మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పీఠాలను కైవసం చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది.
రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ వైపు మొగ్గు చూపడం వల్ల తమ వార్డుల అభివృద్ధికి నిధులు సులువుగా అందుతాయనే ఆలోచనలో స్వతంత్రులు ఉటారు. ఫిబ్రవరి 16న జరగనున్న ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం మేయర్, చైర్మన్ ఎన్నికలు జరగనుండటంతో, అప్పటి వరకు ఈ రాజకీయ సమీకరణాలు మరిన్ని మలుపులు తిరిగే అవకాశం ఉంది.