కాంగ్రెస్ హైకమాండ్‌కు, రేవంత్ రెడ్డికి దూరం పెరిగిందని కొంత మంది సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూంటారు. కేటీఆర్, హరీష్ రావు లాంటి నేతలు బహిరంగంగానే ఇలాంటి మాటలు చెబుతూంటారు. రేవంత్ కు ..రాహుల్ అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదని..కలిసి దిగిన ఫోటోలు కూడా బయటకు రావడం లేదని లాజిక్కులు చెబుతూంటారు. అయితే రేవంత్ మాత్రం హైకమాండ్ తో తనకు ఉన్న ర్యాపో గురించి ఎవరికీ చెప్పుకోవాల్సిన అవసరం లేదని అంటూంటారు. అప్పుడప్పుడూ.. రేవంత్ కు తెలియకుండానే.. ఆయన ముద్ర హైకమాండ్ పై ఎలా ఉందో బయట పడుతూ ఉంటుంది.
రేవంత్ లాగే మోదీ చేయాలంటున్న కాంగ్రెస్ హైకమాండ్
కులగణన విషయంలో బీజేపీకి కౌంటర్ ఇవ్వడానికి ఇప్పుడు రేవంత్ రెడ్డి గొప్ప ఆయుధంగా మారారు. ఆయనను ఆదర్శంగా తీసుకుని రాజకీయాలు చేస్తున్నారు. ప్రత్యేకంగా సమావేశమైన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఈ మేరకు.. రేవంత్ ప్రభుత్వాన్ని అభినందించింది. ఆయన చేసిన కులగణన అద్భుతంగా ఉందని అదే మోడల్ లో దేశవ్యాప్తంగా కులగణన చేయాలని తీర్మానం చేసింది. రేవంత్ సర్కార్ పనితీరుకు హైకమాండ్ నుంచి ఇంత కంటే పెద్ద కాంప్లిమెంట్ ఏమి ఉంటుంది. కర్ణాటకలో కులగణన చేశారు కానీ.. ఆమోదించలేకపోతున్నారు.
కులగణన క్రెడిట్ రాహుల్‌కు వచ్చేలా రేవంత్ రాజకీయం
కులగణన చేస్తామని కేంద్రం ప్రకటించినప్పటి నుండి కాంగ్రెస్ పార్టీకి ఉక్కపోత ఉంది. తమ ఆయుధం మోదీ లాగేసుకున్నారని అనుకుంటూ వచ్చారు. కానీ రేవంత్ రెడ్డి మొదటగా ఎదురుదాడికి దిగారు. కులగణన పై మోదీ నిర్ణయం వెనుక రాహుల్ గాంధీ ఉన్నారని.. ఆయన కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నారని క్రెడిట్ అంతా రాహుల్ దేనని వాదిస్తూ ప్రెస్ మీట్లు పెట్టారు. జాతీయ మీడియాల్లోనూ రేవంత్ వ్యాఖ్యలు హైలెట్ అయ్యాయి. అదే సమయంలో కులగణన తెలంగాణ మోడల్ లో చేయాలని అదంతా రాహుల్ విజన్ అని రేవంత్ ప్రచారం చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు హైకమాండ్ అదే అందుకుంది.
రేవంత్ పనితీరుకు హైకమాండ్ ఫిదా
రేవంత్ పని తీరు పట్ల హైకమాండ్ అసంతృప్తిగా ఉందో లేదో ఎవరికీ తెలియదు. ఆయనపై అసంతృప్తి ఉన్నట్లుగా ఎలాంటి నిర్ణయాలు జరగలేదు. పీసీసీ చీఫ్ గా రేవంత్ ను చెప్పిన వారినే నియమించారు. ఎమ్మెల్సీల విషయంలోనూ అదే జరిగింది. ఆశావహులు ఎక్కువగా ఉండటంతో మంత్రివర్గ విస్తరణపై మాత్రం హైకమాండ్ ఎటూ తేల్చడం లేదు. దీన్ని పట్టుకుని రేవంత్ కు పలుకుబడి తగ్గిపోయిందని ప్రచారం చేసి ఆనందపడిన వారికి ఇప్పుడు రియాలిటీ తెలుస్తోందన్న సెటైర్లు వినిపిస్తున్నాయి.