కొండా సురేఖ వివాదాన్ని మరింత పెద్దది చేసి ప్రజల్లో చులకన అయ్యే కంటే సైలెంట్ గా పరిష్కరించాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తోంది. జరిగిన ఘటనలపై ప్రెస్మీట్ పెట్టాలనుకున్న కొండా సురేఖను .. కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ నిలువరించారు. తనతో వచ్చి మాట్లాడాలని పిలిచారు. ఆమె తన కుమార్తె సుస్మితతో కలిసి మీనాక్షినటరాజన్ ను కలిశారు. లోపల ఏం చర్చించారో స్పష్టత లేదు. కానీ ఎవరూ బయట మాట్లాడవద్దని మాత్రం నిర్ణయించుకున్నారు.
మరో వైపు కొండా సురేఖ మంత్రిగా తనకు లభించిన ప్రోటోకాల్ వదులుకున్నారు. సొంత కారులోనే మీనాక్షి నటరాజన్ వద్దకు వెళ్లారు. ఆ తర్వాత కేబినెట్ సమావేశం ఉన్నప్పటికీ వెళ్లలేదు. కొంత సేపు కొండా సురేఖ కోసం చూసి.. కేబినెట్ సమావేశాన్ని నిర్వహించారు. కొండా సురేఖ వర్గం సోషల్ మీడియాలో నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినే టార్గెట్ చేస్తున్నారు. వారి సోదరుల దందాలను అడ్డుకున్నందు వల్లనే కొండా సురేఖను టార్గెట్ చేస్తున్నారని చెబుతున్నారు. కొన్ని భూ వివాదాల గురించి సోషల్ మీడియాలో చర్చిస్తున్నారు.
రేవంత్ రెడ్డి కూడా తాను ఇంత కాలం కొండా సురేఖకు మద్దతుగా ఉంటూ వస్తే ఇప్పుడు తనను టార్గెట్ చేయడం, తన కుటుంబసభ్యులపై విమర్శలు చేయడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారని అంటున్నారు. కొండా సురేఖతో మాట్లాడాలని కూడా ఆయన అనుకోవడం లేదు. హైకమాండ్ కు తాను చెప్పాల్సింది చెప్పానని వారి నిర్ణయం బట్టే ముందుకెళదామని ఆయన భావిస్తున్నట్లుగా చెబుతున్నారు.