జూబ్లిహిల్స్ లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన తర్వాత చాలా మంది మేము మద్దతిచ్చాం అంటే.. మేమే గెలిపించామని ముందుకు వస్తున్నారు. ఇదే పద్దతిలో సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ చేసే వాళ్లు కూడా మేము ముందు అంచనా వేశామంటే.. మేము ముందు అంచనా వేశామని ప్రచారం చేసుకుంటున్నారు. కానీ ఎన్నికలకు ముందు ఏ ఒక్క వర్గమూ.. ఇలా బహిరంగంగా ప్రకటించి ఓట్లు వేయరు. ఎవరైనా ఓ మూక సీఎంను కలిసి మద్దతు ప్రకటిస్తే.. ఆ వర్గం ారంతా.. మూకుమ్మడిగా ఓట్లు వేసేయరు.
టీడీపీ మద్దతు కాంగ్రెస్కు దక్కిందట !
ఫలితాలు వచ్చిన తర్వాత చాలా మంది టీడీపీ మద్దతు కాంగ్రెస్ కు దక్కిందని ప్రచారం చేస్తున్నారు. సెటిలర్లు .. టీడీపీ సానుభూతిపరులు రేవంత్ కోసం జూబ్లిహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ కే మద్దతిచ్చారని అంటున్నారు. పోలింగ్ కు ముందు ఇలా మద్దతిస్తారని ఎవరూ చెప్పలేదు. నిజంగా సెటిలర్లు, టీడీపీ సానుభూతిపరులు ఎవరికి ఓటేశారో తెలుసు. వారందర్నీ ఒకే వైపు ఆకర్షించేంత భావోద్వేగంతో లేదా.. ప్లస్ పాయింట్ అక్కడేమీ లేదు. అందుకే అందరూ ఎవరి ఆత్మప్రబోధానుసారం వాళ్లు ఓట్లు వేసి ఉంటారు. అమీర్ పేటలో ఎన్టీఆర్ విగ్రహం పెడతారని.. ఓట్లు వేసే వర్గం ఉంటుదంని కూడా అనుకోలేం.
అన్ని వర్గాల మద్దతు కాంగ్రెస్ కే
గెలిచారు కాబట్టి ఇప్పుడు తాము మద్దతిచ్చామంటే..తాము మద్దతిచ్చామని ప్రకటించుకునేందుకు చాలా వర్గాలు వస్తాయి. అలాగే వస్తున్నాయి. తాము శక్తి వంచన లేకుండా ప్రయత్నించామని.. గొప్ప విజయం లభించిందని కొంత మంది సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారు. అన్ని వర్గాల నేతలదీ ఇదే మాట. అందరూ గెలిచిన పార్టీకే మద్దతిస్తే బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన ఎనభై వేల ఓట్లు ఎవరు వేసినట్లు ?. నవీన్ యాదవ్ కు ఉన్న వ్యక్తిగత ఆదరణ, మజ్లిస్ మద్దతు మాత్రమే కాంగ్రెస్ విజయానికి కారణం. ఇక అందరూ.. రాగి చెంబుల పాలకు బదులు నీళ్లు పోసినట్లుగానే మద్దతు ప్రకటించారని అనుకోవాలి.
పార్టీ నేతలు, సోషల్ మీడియా కార్యకర్తలదీ అదే మాట
పార్టీ నేతలు , కార్యకర్తలు కూడా తమ కష్టం తక్కువ కాదని క్లెయిమ్ చేసుకుంటున్నారు. మంత్రి వివేకా తాను జూబ్లిహిల్స్ లో అడుగు పెట్టేసరికే కాంగ్రెస్ 22 శాతం ఓట్ల తేడాతో వెనుకబడి ఉందని తాను.. పట్టుకుని లాక్కొచ్చానని చెప్పుకుంటున్నారు. ఇక సోషల్ మీడియా కార్యకర్తల సంగతి చెప్పాల్సిన పని లేదు. ఎవరికి వారు క్రెడిట్ ఇచ్చేసుకుంటున్నారు. నిజానికి.. ఇది ఏ ఒక్కరి విజయమో కాదు.. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కష్టపడి పని చేసి తెచ్చుకున్న విజయం. ఎవరైనా నా వల్లే అనుకుంటే అంత కంటే అమాయకత్వం ఉండదు. కానీ అలా అనుకోవడం వల్ల ఎన్నో సమస్యలు వస్తాయి.

