ప్రతిపక్షం అన్నాక రాజకీయం చేయడం సహజం. కానీ, దేశ భద్రతకు సంబంధించిన వ్యవహారాల్లో అలా చేయడం ఏమాత్రం సమంజసం కాదు. ఈ విషయం 125ఏళ్ల చరిత్ర ఉన్న వృద్ద కాంగ్రెస్ పసిగట్టలేకపోతుందో మరేమిటో , అదేపనిగా రాజకీయమే పరమావధిగా ముందుకు సాగుతూ విమర్శలను ఎదుర్కొంటోంది.
పహల్గం ఉగ్రదాడితో పాక్ కు సరైన బుద్ధి చెప్పాలని యావత్ దేశం కోరుకుంటోంది. మరోసారి ఉగ్రదాడి చేయాలంటే వణికిపోయేలా సమాధానం చెప్పాలని కేంద్రం కూడా పట్టుదలతో ఉంది. పాక్ – భారత్ మధ్య వార్ అంటే ప్రజల భావోద్వేగాలకు సంబంధించినది కావడంతో కేంద్రం కూడా పక్కా ప్లాన్ తో ముందుకు వెళ్తోంది. పాక్ పై యుద్ధ సన్నాహాల నేపథ్యంలో అంతర్జాతీయంగా ఎలాంటి ఆటంకాలు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. భారత్ పై ఒత్తిడి తీసుకొచ్చేందుకు పాక్ ప్రయత్నాలు చేస్తున్నా వాటికి ఏమాత్రం బలం లేకుండా చేస్తోంది.
పాక్ కు సరైన బుద్ధి చెప్పాల్సిన ఈ టైంలో దేశమంతా కేంద్రం వైపు మద్దతుగా నిలబడాల్సిన సమయం ఇది. కానీ, పహల్గం ఉగ్రదాడిలో కేంద్రాన్ని నిందించేందుకు ఖర్గే అతి ఉత్సాహం చూపిస్తుండటం కాంగ్రెస్ శ్రేణులకు కూడా ఆగ్రహం తెప్పిస్తోంది. కేంద్రం వైఖరి చూస్తుంటే పాక్ పై ఏ క్షణమైనా యుద్ధం జరగడం ఖాయమని స్పష్టం చేస్తోంది. ఈ సమయంలో పహల్గం ఉగ్రదాడికి కేంద్రం నిర్లక్ష్యమే కారణం అనే వాదనను కాంగ్రెస్ ప్రచారంలో ఉంచాలని ప్రయత్నించడం విమర్శలకు తావిస్తోంది.
ఇప్పుడు తప్పుడు ఎవరిదీ ?ఎవరి వైఫల్యం అనే దాని గురించి చర్చించాల్సిన సమయం కాదు..అందుకు మున్ముందు మరింత సమయం ఉంది. ఇప్పుడు చేయాల్సిందల్లా .. మరోసారి ఉగ్రదాడులు చేయకుండా పాక్ కు బుద్ధి చెప్పడమే. ఈ విషయాన్ని వదిలేసి కేంద్రం వైఫల్యమేనని నిందించడం అంటే,అది పరోక్షంగా పాక్ చేస్తున్న స్వీయ రక్షణకు మద్దతు ప్రకటించడమే అవుతుంది.
పాక్ కు గట్టి సమాధానం చెప్పాలని దేశమంతా కోరుకుంటోంది. లేదంటే భారత్ లో ఉగ్రదాడులకు పాక్ భవిష్యత్ లో తెగబడవచ్చు. ఈ కీలక సమయంలో రాజకీయాలను వదిలేయాల్సిన కాంగ్రెస్ ఆ పని చేయడం లేదు. ఇప్పటికే ఈ ఉగ్రదాడి తర్వాత విమర్శలేదురయ్యలా స్పందించిన కాంగ్రెస్,తాజా స్పందనతో భారతీయుల్లో మరింత ద్వేషాన్ని మూటగట్టుకుంటోంది.