కోమ‌టిరెడ్డి సోద‌రుల‌కు ఇలా చెక్ పెడుతున్నారా?

తెలంగాణ పీసీసీ పీఠం కోసం కోమ‌టిరెడ్డి సోద‌రుల ప్ర‌య‌త్నాలు అనేవి ఈనాటి మాట కాదు! చాలారోజుల నుంచీ వారు ఈ పీఠంపై క‌న్నేశారు. ఢిల్లీకి వెళ్లి, హైక‌మాండ్ ను ఒప్పించే ప్ర‌య‌త్నాలు చేశార‌ని కూడా చెప్పుకుంటారు. ఇదే క్ర‌మంలో, పీసీసీ అధ్య‌క్షుడు ఉత్త‌మ్ కుమార్ రెడ్డిపై ఫిర్యాదులు కూడా చేసిన‌ట్టు క‌థ‌నాలు వ‌చ్చాయి. ఓర‌కంగా కోమ‌టిరెడ్డి సోద‌రుల దూకుడు వ్య‌వ‌హారంపై కొంత‌మంది కాంగ్రెస్ నేత‌లు గుర్రుగా ఉన్న సంగ‌తీ తెలిసిందే. ఆ సోద‌రుల‌కు ఢిల్లీలో ఓ ప్రముఖ కాంగ్రెస్ నేత అండ ఉంద‌నీ అంటారు! అయితే, తెలంగాణ పార్టీ వ్య‌వ‌హారాల ఇన్ ఛార్జ్ గా కుంతియా వ‌చ్చాక వీరిద్దరూ కాస్త డీలా ప‌డ్డ‌ట్టు ఇప్పుడు పార్టీ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. వారి అభీష్టానికి విరుద్ధంగా పార్టీలో కొన్ని ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయనీ, వీటి వెనక కొన్ని శక్తుల ప్రభావం ఉందనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

మునుగోడు టిక్కెట్ కోసం కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి ఎదురు చూస్తున్న సంగ‌తి తెలిసిందే. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీ త‌ర‌ఫున ఆ నియోజ‌క వ‌ర్గం నుంచే టిక్కెట్ ద‌క్కాల‌న్న ఉద్దేశంతోనే.. సోద‌రులు ఇద్ద‌రూ అక్క‌డ ప్ర‌త్యేక దృష్టి పెట్టారు. స్థానిక కాంగ్రెస్ నేత‌లకంటే వీరి హ‌డావుడే అక్క‌డ కాస్త ఎక్కువ‌గా ఉంద‌ని అంటారు! అయితే, ఇదే నియోజ‌క వ‌ర్గం నుంచి గ‌త ఎన్నిక‌ల్లో పాల్వాయి స్ర‌వంతి పోటీ చేశారు. 2019లో కూడా ఆమెకే టిక్కెట్ ద‌క్కుతుంద‌ని ఆశాభావంతో ఉన్నారు. కానీ, కోమ‌టిరెడ్డి సోద‌రుల హ‌డావుడి చూస్తుంటే… మునుగోడు టిక్కెట్ త‌మ‌కే అన్న‌ట్టుగా ప‌రిస్థితి ఉంది. స‌రిగ్గా.. ఈ ప‌రిస్థితికే ఇప్పుడు చెక్ ప‌డింద‌ని చెప్పుకోవ‌చ్చు. తాజాగా మునుగోడు నియోజ‌క వ‌ర్గం ప‌రిధిలోలో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో పార్టీ ప్ర‌ముఖ నేత‌ల్లో ఒక‌రైన స‌ర్వే స‌త్యనారాయ‌ణ ఓ ప్ర‌క‌టక‌ చేశారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో స్ర‌వంతికే టిక్కెట్ వ‌స్తుంద‌ని ప్ర‌క‌టించేశారు. మరి, ఆయనకున్న సమాచారమేంటో తెలీదు. దీంతో కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి తీవ్ర అసంతృప్తికి గురైన‌ట్టు స‌మాచారం. ఇది కావాలనే చేసిన ప్రకటనగా వారు విశ్లేషించుకుంటున్నారట.

నిజానికి, కంచ‌ర్ల భూపాల‌రెడ్డిని కాంగ్రెస్ లోకి తీసుకొచ్చే ప్ర‌య‌త్నాలు ఈ మ‌ధ్య జ‌రిగాయి. అదే జ‌రిగితే కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డికి చెక్ పెట్టినట్టు అవుతుంది. ఈ విష‌యం ముందుగా గ్ర‌హించిన కోమ‌టిరెడ్డి కాస్త జాగ్ర‌త్తప‌డ్డార‌ట‌. ఆయ‌న రాక‌ను అడ్డుకునేందుకు బాగానే క‌ష్ట‌ప‌డ్డార‌ని స‌మాచారం. ఇక‌, రేవంత్ రాక త‌రువాత పార్టీలో వారి ప్రాధాన్య‌త త‌గ్గిపోతోంద‌నే కొంత అభ‌ద్ర‌తా భావ‌మూ వారిలో ఉందనీ అంటారు. పార్టీలో త‌మ ప్ర‌యోజ‌నాల కోస‌మే చ‌క్రం తిప్పుతూ వ‌చ్చిన కోమ‌టిరెడ్డి సోద‌రుల‌కు ఈ తాజా ప‌రిణామాలు కొంత ఇబ్బందిక‌ర‌మైన ప‌రిస్థితుల‌నే తెచ్చిపెట్టాయ‌నేది ప‌రిశీల‌కుల మాట‌. ఈ సోద‌రుల దూకుడుకు కళ్లెం వెయ్యాల‌న్న వ్యూహంతోనే కొంత‌మంది తెర వెనక చ‌క్రం తిప్పిన‌ట్టు గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.