కాంగ్రెస్ పార్టీ తాను ఓడిపోవడం కాదు.. మిత్రపక్షాలను కూడా ఓడిస్తుందన్న ప్రచారం ఉంది. బీహార్ తో పాటు చాలా రాష్ట్రాల్లో అదే జరిగింది. ఇప్పుడు అదే పని తమిళనాడులో కూడా చేస్తోంది. డీఎంకేను ఓడించే రాజకీయాలు ప్రారంభించింది. ఏకంగా పవర్ షేరింగ్ డిమాండ్ చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. అంటే సీఎం పదవిని పంచుకుందామని తమిళనాడు కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అలాగే అసెంబ్లీ సీట్లు కూడా పోటాపోటీగా కేటాయించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. ఈ డిమాండ్ నెరవేరని పక్షంలో తాము ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తామంటూ పరోక్షంగా హెచ్చరికలు జారీ చేస్తోంది.
విజయ్ పార్టీని బూచిగా చూపుతున్న కాంగ్రెస్
కాంగ్రెస్ ఇప్పుడు డీఎంకేను భయపెట్టడానికి సినీ నటుడు విజయ్ స్థాపించిన తమిళ వెట్రి కళగం ను ఒక అస్త్రంగా వాడుకుంటోంది. విజయ్ పార్టీకి రాష్ట్రవ్యాప్తంగా వస్తున్న ఆదరణను గమనించిన కాంగ్రెస్ హైకమాండ్ లోని కొందరు నేతలు ఆయనతో టచ్‌లోకి వెళ్లినట్లు సమాచారం. డీఎంకే తమను తక్కువ అంచనా వేస్తే, తాము విజయ్ వైపు మొగ్గు చూపుతామనే సంకేతాలను కాంగ్రెస్ నేతలు పంపిస్తున్నారు. ఇది డీఎంకే అధినేత స్టాలిన్‌కు ఆగ్రహాన్ని కలిగిస్తోంది. రాహుల్ గాంధీకి స్టాలిన్‌తో మంచి సంబంధాలు ఉన్నప్పటికీ, కాంగ్రెస్ జాతీయ నాయకత్వం మాత్రం తమిళనాడులో పార్టీని బలోపేతం చేసుకోవడానికి విజయ్ వంటి కొత్త శక్తులతో జతకట్టడం మేలని భావిస్తున్నట్లు సమాచారం. విజయ్ బీజేపీని సిద్దాంతపరమైన శత్రువంటున్నారు.. డీఎంకే రాజకీయ శత్రువులంటున్నారు కానీ కాంగ్రెస్ ను మాత్రం ఇప్పటికీ విమర్శించడం లేదు.
పోటీకి కమల్ హాసన్ పార్టీ కూడా రెడీ
కూటమిలో రచ్చ కేవలం కాంగ్రెస్‌తోనే ఆగలేదు. నటుడు కమల్ హాసన్ నేతృత్వంలోని MNM కూడా ఈసారి అసెంబ్లీ బరిలో నిలవడానికి భారీ సంఖ్యలో సీట్లు కోరుతోంది. ఇప్పటికే ఆయనకు రాజ్యసభ సీటు ఇచ్చిన డీఎంకే, అసెంబ్లీ సీట్ల విషయంలో మాత్రం వెనక్కి తగ్గుతోంది. మరోవైపు పాట్టాలి మక్కల్ కచ్చి లో చీలిక రావడం, ఆ పార్టీలోని ఒక వర్గం ఏఐఏడీఎంకే-బీజేపీ కూటమి వైపు వెళ్లడం వంటి పరిణామాలు డీఎంకేలో ఆందోళన పెంచుతున్నాయి. ఓట్లు చీలిపోతే అది పరోక్షంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటుగా మారి డీఎంకేకు నష్టం చేకూరుస్తుందనే భయం కనిపిస్తోంది.
ప్రధానంగా కాంగ్రెస్ చేసే నష్టమే ఎక్కువ
గతంలో ఎన్నో రాష్ట్రాల్లో మిత్రపక్షాలతో ఆటాడుకుని చివరికి తనతో పాటు కూటమిని కూడా ముంచిన చరిత్ర కాంగ్రెస్‌కు ఉందని రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు తమిళనాడులో కూడా అదే సీన్ రిపీట్ అయితే, అది డీఎంకేకు పెద్ద దెబ్బే అవుతుంది. అందుకే కాంగ్రెస్ బెదిరింపులకు లొంగకూడదని డీఎంకే నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చినన్ని సీట్లు కూడా ఈసారి ఇచ్చే ప్రసక్తి లేదని, కొత్తగా వచ్చే మిత్రపక్షాల కోసం కాంగ్రెస్ తన వాటా తగ్గించుకోవాలని డీఎంకే స్పష్టం చేస్తోంది. ఒకవేళ కాంగ్రెస్ కూటమి నుంచి వెళితే, దానివల్ల జరిగే నష్టం కంటే, కాంగ్రెస్ అడిగినన్ని సీట్లు ఇవ్వడం వల్ల వచ్చే నష్టమే ఎక్కువని డీఎంకే భావిస్తోంది. తమిళనాడు రాజకీయం ఇప్పుడు డీఎంకే-కాంగ్రెస్ మధ్య జరుగుతున్న మైండ్ గేమ్ గా మారింది.
