వచ్చే ఎన్నికల్లో 100 అసెంబ్లీ, 15 లోక్ సభ సీట్లు గెలుస్తామని లేకపోతే తనదే బాధ్యతని కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ ప్రకటించారు. ఎన్నికలకు ఇంకా మూడున్నరేళ్ల సమయం ఉంది. జమిలీ నిర్వహిస్తే మరో ఆరు నెలలు ఆలస్యం అవుతుంది. నాలుగేళ్లకు వచ్చే ఎన్నికల్లో ఫలితాలపై ఇప్పుడే టార్గెట్ డిసైడ్ చేసుకోవడం మంచిదే కానీ ముందు ఉన్న సవాళ్లనూ అధిగమించాల్సి ఉంటుంది. కాంగ్రెస్ ముందు ఇప్పుడు ఉన్న అసలు సవాల్ జూబ్లిహిల్స్ ఉపఎన్నిక.
అధికార పార్టీగా ఉండి ఎమ్మెల్యే సీట్లను కోల్పోవడం అనేది మంచి సూచిక కాదు. కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో కంటోన్మెంట్ ఎన్నికల్లో మంచి ఫలితం సాధించింది. కానీ జూబ్లిహిల్స్ ఉపఎన్నిక వేరు. ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతోందని బీఆర్ఎస్ ప్రచారం చేస్తున్న సమయంలో జరుగుతున్న ఉపఎన్నిక. ఈ ఎన్నికలో గెలవడం కాంగ్రెస్ పార్టీకి అత్యంత ప్రతిష్టాత్మకం. కాంగ్రెస్ పార్టీలో ఉండే అనేక రకాల హైకమాండ్ ధోరణుల కారణంగా పార్టీ వ్యూహాలను అమలు చేయడం రేవంత్ రెడ్డికి కూడా అంత తేలిక కాదు. పార్టీ అభ్యర్థిని చివరి వరకూ ఖరారు చేయరు. ఆశావహులకు.. ఎప్పటికప్పుడు ఆశలు పెంచేస్తూంటారు. చివరికి వారంతా అసంతృప్తులవుతారు.
జూబ్లిహిల్స్ లో కాంగ్రెస్ పార్టీ గెలిచి చాలా కాలం అయింది. అక్కడ ముస్లిం ఓటు బ్యాంక్ కీలకం. మజ్లిస్ సపోర్టు కూడా కీలకమే. పైగా బలమైన అభ్యర్థి లేరు. అజరుద్దీన్ ఎన్నికల సమయంలో మాత్రమే కనిపిస్తారు. గత ఎన్నికల్లో చివరి క్షణంలో అజర్ పేరును ఖరారు చేశారు. జూబ్లిహిల్స్ ఎన్నికల్లో గెలిస్తేనే కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి పెట్టుకున్న టార్గెట్ విషయంలో ఓ అడుగు ముందుకు వేసినట్లు అవుతుంది. లేకపోతే ఆదిలోనే. హంసపాదు అన్నట్లుగా ఉంటుంది.
సాధారణంగా ఓ ఎమ్మెల్యే చనిపోతే వారి కుటుంబసభ్యులకు ఏకగ్రీవంగా చాన్స్ ఇచ్చే సంప్రదాయం ఉండేది. కానీ కేసీఆర్ .. గతంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు చనిపోతే.. ఆ సంప్రదాయం పాటించలేదు. తమ అభ్యర్థుల్ని నిలబెట్టి గెలిపించుకున్నారు. దాంతో ఆ సంప్రదాయం పోయింది. ఎన్నికలు తప్పనిసరి అవుతున్నాయి.