ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ ఉందా లేదా ఉంటుందా అనే అనుమానాస్పద స్థితిలో ఉంది! రాష్ట్ర విభజనతో ఆంధ్రుల ఆగ్రహానికి గురికావాల్సి వచ్చింది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక్కటంటే ఒక్క సీటూ కూడా దక్కించుకోలేకపోయింది. పోనీ, ఎన్నికల తరువాతనైనా కాస్తైనా పుంజుకుందా అంటే.. అదీ లేదు! ఆంధ్రా కాంగ్రెస్‌కు బలమైన నాయకుడు కావాలి. ఆ నాయకుడు ఎవరౌతారు అనేది పార్టీలో అంతర్గతంగా కొన్నాళ్లు చర్చనీయాంశంగానే నిలుస్తూ వచ్చేది. అయితే, ఇప్పుడు ఆ నాయకుడు జగన్ అయితే బాగుంటుందనే అభిప్రాయం ఏపీ కాంగ్రెస్ వర్గాల్లో వ్యక్తమౌతున్నట్టుగా చెప్పుకోవాలి!
జగన్ కాంగ్రెస్‌లోకి వస్తే, ఆ పార్టీ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా వచ్చే ఎన్నికల బరిలోకి దిగుతారు అంటూ అభిప్రాయపడ్డారు కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి. జగన్ తమ పార్టీలో చేరగానే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తాం అన్నారు. ఇది ఆమె సొంత అభిప్రాయం అనుకోవడానికి వీల్లేదు! ఒకవేళ అలాంటిదే అయితే ‘సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తాం’ అనలేరు కదా. అది పార్టీ చర్చించి తీసుకోవాల్సిన నిర్ణయం కదా. అయితే, ఈ అభిప్రాయం ఇవాళ్ల పనబాక బయట పెట్టారు. నిజానికి కొన్ని నెలల కిందట చిత్తూరు జిల్లాకు చెందిన కాంగ్రెస్ నాయకుడు చింతా మోహన్ కూడా అభిప్రాయపడ్డారు. ఏకంగా ఓ బహిరంగ సభలోనే తమ పార్టీకి దమ్మున్న నాయకుడు అవసరమనీ, అయితే జగన్… కాదంటే పవన్ కల్యాణ్‌లకు కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు అప్పగించాలని ఆయన అన్నారు. ఆ సందర్భంలో కాంగ్రెస్ నేతలు చింతా వ్యాఖ్యలకి ఖంగుతున్నారు. అది ఆయన వ్యక్తిగత అభిప్రాయం అన్నట్టుగా వ్యాఖ్యానించారు.
మరి, కాంగ్రెస్ సీఎం అభ్యర్థి జగనే అని పనబాక నమ్మకంగా చెప్పారంటే అది ఆమె వ్యక్తిగత అభిప్రాయం ఎలా అవుతుంది! కాంగ్రెస్ సైడ్ నుంచి ఆలోచిస్తే ఆంధ్రాలో ఉనికి చాటుకోవాలంటే జగన్ లాంటి కరిజ్మా ఉన్న నాయకుడు కావాలి. కాంగ్రెస్‌కు జగన్ అవసరం. కానీ, జగన్‌కు కాంగ్రెస్ ఎంతవరకూ అవసరం..? వారిది మనుగడ కోసం పోరాటం కాబట్టి జగన్ లాంటి బలమైన నాయకుడు కావాలి. కానీ, కాంగ్రెస్ పంచన చేరాల్సిన పరిస్థితి జగన్‌కు ఏముంది..?
అయితే, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్ ఆలోచన ఆచరణ సాధ్యం కాదనే అనిపిస్తోంది. కానీ, ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది. రాజకీయాల్లో శాశ్వత శత్రుత్వాలుండవు. ఆ మాటకొస్తే అసలు శత్రుత్వాలే ఉండవు. ఉండేవన్నీ అధికార అవసరాలే! అలాంటి అవసరం ఏదో ఒక సందర్భంలో ప్రతీ పార్టీకి ఉంటుంది. ప్రస్తుతానికి జగన్ కోసం కాంగ్రెస్ చూసున్న ఎదురుచూపులు అర్థం లేనివిగా కనిపించొచ్చు. కానీ, భవిష్యత్తు ఎలా మారుతుందో ఇప్పుడు చెప్పలేం కదా!