“నన్ను నమ్మిన వాళ్లకి ఆలస్యంగానైనా పదవులు దక్కుతాయి..అందుకు అద్దంకి దయాకరే ఉదాహరణ”.. ఇది ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి పదవుల కోసం నిరీక్షిస్తున్న వారికి ఇచ్చిన భరోసా. కానీ, కాంగ్రెస్ మహిళా విభాగం అధ్యక్షురాలు సునీతరావు తొందరపడుతున్నారు. తనకు వెంటనే పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పార్టీని ఇరకాటంలోకి నేట్టేసేలా ఆందోళన చేపట్టారు.
ఏకంగా గాంధీ భవన్ లో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చాంబర్ ముందు ఆందోళన చేపట్టారు. మహిళలకు పదవులు ఇవ్వాలని తన అనుచరులతో కలిసి నినాదాలు చేశారు. ఎమ్మెల్సీ ఇస్తామని హామీ ఇచ్చి విస్మరించారని చెప్పుకొచ్చారు. ఎన్నికల్లో ఓడిపోయే సీటు ఇచ్చినా, అధికారంలోకి వచ్చాక న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు.
పదవుల కోసం ఇంకెన్నాళ్లు వేచి చూడాలని గాంధీ భవన్ ముందే ఆందోళనకు దిగడం అంటే ఆమె నోటికాడి బుక్కను కాలదన్నుకోవడమే అవుతుంది. మహిళా కోటాలో పదవులు ఇవ్వాల్సి వస్తే ఆమె పేరు పరిశీలనలో ఉంది. అయినా ఆమె పార్టీ తనకు ఇప్పటికప్పుడు పదవి ఇవ్వాలని పట్టుబట్టడం, నిరసన తెలపడం చేశాకా పదవి ఇస్తుందా? క్రమశిక్షణ కమిటీకి సునీతా రావుపై ఫిర్యాదు చేశారు.
ఈ లెక్కన చూస్తే.. ఆమెకు ఇక పదవి లేనట్లే. ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక పదవి కోసం సంవత్సరం నుంచి వేచి చూస్తోంది. ప్రస్తుతం పదవుల భర్తీపై చర్చ కూడా లేదు కానీ, అనూహ్యంగా పదవుల కోసం నేతలపై ఫైట్ చేసేందుకు వెళ్లి వచ్చే పదవికి రెడ్ సిగ్నల్ ఇప్పించుకున్నారు సునీతా.
సునీతారావు కంటే పార్టీలో సీనియర్లు చాలామంది ఉన్నారు. ఓయూ జాక్ నేత , నేషనల్ ఓబీసీ తమిళనాడు ఇంచార్జ్ కేతూరి వెంకటేష్ పాతికేళ్ళుగా పార్టీ కోసం పని చేస్తున్నారు. ఆయనతోపాటు చాలామంది పదవి కోసం వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడైనా న్యాయం జరుగుతుందని నమ్ముతున్నారు..ఏనాడూ గాంధీ భవన్ లో నిరసన తెలపలేదు. ఆమె మాత్రం ఓపిక నశించిందని, ఇక వచ్చే పదవిని పోగొట్టుకున్నారని గాంధీ భవన్ వర్గాలు అంటున్నాయి.