సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ముఖ్యనేతలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో కొన్ని చోట్ల ఆశ్చర్యకర ఫలితాలు వస్తున్నాయి. హరీష్ రావుకు తిరుగులేని పట్టు ఉన్న సిద్దిపేట నియోజకవర్గంలో మెజార్టీ పంచాయతీలు బీఆర్ఎస్ మద్దతుదారులు గెల్చుకున్నారు. తొలి విడతతో కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గంలో మాత్రం అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ గెల్చుకుంది. ఇది బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత చర్చకు కారణం అవుతోంది.
నియోజకవర్గం మొత్తం ఎన్నికలు జరగలేదు. మొదటి విడతలో భాగంగా.. కొన్ని మండలాల్లో ఎన్నికలు జరిగాయి. సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ నియోజకవర్లాల్లో రెండు, మూడు మండలాల్లో ఎన్నికలు జరిగాయి. సిరిసిల్లలో మొదటి విడతలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 44 పంచాయతీలను కాంగ్రెస్ మద్దతుదారులు గెలిచారు. బీఆర్ఎస్ మద్దతుదారులు 30 పంచాయతీల్లోనే గెలిచారు. బీజేపీ ఎడు పంచాయతీల్లో గెలిచింది. ఈ ఫలితాలు భారత రాష్ట్ర సమితి శ్రేణులకు షాక్ ఇచ్చాయని అనుకోవచ్చు.
సిరిసిల్లలో కేటీఆర్ క్రమంగా పట్టు కోల్పోతున్నారు. మొదటి సారి చాలా స్వల్ప తేడాతో గెలిచిన ఆయన తర్వాత ఉద్యమ ఎఫెక్ట్ తో మినిమం యాభై వేల ఓట్లతేడాతో గెలుస్తూ వస్తున్నారు. 2018లో 90వేల మెజార్టీ సాధించారు. కానీ గత ఎన్నికల్లో అది 26వేలకు పడిపోయింది. కొన్ని రౌండ్లలో వెనుకబడిపోయారన్న ప్రచారమూ జరిగింది. ఇప్పుడు పల్లెల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభావం చూపించడం.. కేటీఆర్కు డేంజర్ సిగ్నల్సే అనుకోవచ్చు.
