భారత రాష్ట్ర సమితిలో ఏర్పడిన అంతర్గత సంక్షోభం కాంగ్రెస్ లో అంత సంతోషాన్ని కలిగించడం లేదు. తమ వెనుక ఏదో కుట్ర జరిగిపోతోందన్న ఆందోళనలో వారు ఉన్నారు. మూడురోజుల కిందట హడావుడిగా రేవంత్ రెడ్డి సన్నిహితుడిగా పేరు పడిన ఎంపీ మల్లు రవి ప్రెస్ మీట్ పెట్టారు. టీడీపీ, బీఆర్ఎస్, బీజేపీ కలిసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టాలనుకుంటున్నాయని ఆరోపించారు. అయినా వచ్చే ఎన్నికల్లో మరోసారి కాంగ్రెస్ గొప్పగా గెలుస్తుందన్నారు. వచ్చే ఎన్నికలకు చాలా సమయం ఉంది కానీ మూడు పార్టీల కలయికపై ఎందుకు ఆయన అంత ఆందోళన వ్యక్తం చేశారో రాజకీయ వర్గాలకు కాస్త పజిల్ గానే ఉంది.
తెలంగాణలోనూ ఎన్డీఏ కూటమి వస్తుందని కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. అలా వస్తే చాలు చంద్రబాబును బూచిగా చూపి మరోసారి సెంటిమెంట్ రగిలించేందుకు బీఆర్ఎస్ సిద్ధమయిందని అనుకున్నారు. దానికి తగ్గట్లుగా కొన్ని ప్రకటనలు వచ్చాయి. ప్లనరీలోనూ చంద్రబాబుకు వ్యతిరేక వ్యాఖ్యలు కేసీఆర్ చేశారు. ఇలాంటప్పుడు. బీఆర్ఎస్.. బీజేపీ, టీడీపీతో ఎందుకు జత కడుతుందన్నది ప్రధానంగా వచ్చే ప్రశ్న. అయితే రాజకీయాల్లో ఏదీ అసాధ్యం కాదు. బీఆర్ఎస్ ఎన్డీఏలో చేరాలనుకుంటోందని.. అందుకే బీజేపీని పల్లెత్తు మాట అనడం లేదని అంటున్నారు.
పార్టీని కాపాడుకోవాలంటే బిజేపీ నీడలోకి వెళ్లాల్సిందేనని కేసీఆర్ అనుకుంటూ ఉంటారు. కానీ తాము చేర్చుకునే ప్రశ్నే లేదని గతంలో చెప్పేశామని ప్రధాని మోదీ బహిరంగంగానే చెప్పారు. ఇప్పుడు బీఆర్ఎస్ .. అలాంటి మాటలు అన్న పార్టీతో కలిసి వెళ్తారా లేదా అన్న సందేహం ఉంది. కానీ వీరి కలిసిపోయి తమకు ఎర్త్ పెడతారన్న భయంమాత్రం కాంగ్రెస్ లో ప్రారంభమయింది.