ఎక్కడో నోయిడాలో ఈడీ దాడి చేసింది. ఆస్తులు పట్టుకున్నారు. ఇక్కడ తెలంగాణలో ఇవి తిరుపతిరెడ్డివే అని ప్రచారం ప్రారంభిస్తారు. మరో చోట ఏదో జరుగుతుంది.. ఇదంతా కొండల్ రెడ్డి పనే అనే సోషల్ మీడియా పోస్టులు వైరల్ అవుతాయి. వీరిద్దరు ఎవరంటే.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సోదరులు. బీఆర్ఎస్ పార్టీ ప్రతీ దానికి వీళ్లకు లింక్ పెట్టి వివాదాలు సృష్టించి.. కుటుంబ పాలన అని చెప్పేందుకు కష్టాలు పడుతోంది. నిజంగా వారు ఏం చేస్తున్నారో కానీ.. బీఆర్ఎస్ చెప్పే దానికి మాత్రం ఇలా తోక ఉండదు.
బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇంచార్జ్ క్రిషాంక్.. తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రకటనలు ఇస్తోందని ఆ డబ్బులన్నీ తిరుపతిరెడ్డి ఖాతాలోకి పోతున్నాయని ఆరోపణలు చేశారు. దానికి ఏదైనా బేస్ ఉందంటే ఏమీ లేదు.. అంతా బినామీల పేరు మీద ఆయనకు చేరుతోందని అంటారు. తెలంగాణలో జరిగే ప్రతి వ్యాపారం రేవంత్ రెడ్డి సోదరుల బినామీదేనని వీరి వెర్షన్. అడ్వర్టయిజ్ మెంట్ల ఏజెన్సీ దగ్గర నుంచి ఇంటర్నెట్ వరకూ అదే ఫార్ములా. ఇటీవల కరెంట్ తీగలు తగిలి పలువురు చనిపోయారు. దీంతో ఉపముఖ్యమంత్రి.. పవర్ మినిస్టర్ అయిన భట్టి విక్రమార్క కరెంట్ పోల్స్ పై ఉన్నకేబుల్స్ ను తొలగించాలని ఆదేశించారు. ఆ ప్రకారం తొలగిస్తే.. తిరుపతిరెడ్డి ఇటీవల ఇంటర్నెట్ వ్యాపారం ప్రారంభించారని.. ఆయన కోసమే ఇలా చేస్తున్నారని ఫేక్ పేపర్ క్లిప్లు వైరల్ చేశారు.
సీఎం రేవంత్ రెడ్డికి ఆయన కుటుంబం అండగా ఉంది. ఆయన సోదరులు ఆయనకు పరోక్ష రాజకీయాల్లో సాయం చేస్తున్నారు. నేరుగా రాజకీయాల్లోకి మాత్రం రాలేదు. ఇదే విషయాన్ని ఆయన చెప్పుకున్నారు. కొడంగల్ కు ఎమ్మెల్యేగా రేవంత్ గా ఉన్నప్పటికీ.. చాలా కాలం నుంచి అక్కడి రాజకీయాలను తిరుపతి రెడ్డే చూసుకుంటున్నారు. ఇది బహిరంగరహస్యం. అయితే రేవంత్ సోదరులపై ఆరోపణలు చేస్తే.. రేవంత్ ను రాజకీయంగా దెబ్బకొట్టినట్లు అవుతుందని ఈ వ్యూహం అమలు చేస్తున్నారు. ఎంత వర్కవుట్ అవుతుందో మరి !