ఐపీఎల్ అంటే బెట్టింగ్ మార్కెట్ ఏ స్థాయిలోకి వెళ్తుందో ఊరించడం కష్టం. ఇదంతా బయట జరుగుతుంది. అంతర్గతంగా మాత్రం టిక్కెట్ల బ్లాక్ మార్కెటింగ్ జరుగుతుంది. హైదరాబాద్ క్రికెట్ లో ఈ వ్యవహారం మరోసారి దుమారం రేగుతోంది. ఐపీఎల్ టికెట్ల విక్రయాలు ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దృష్టికి వెళ్లడం క్రీడా వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది.
టిక్కెట్ల బ్లాక్‌మార్కెటింగ్ పై ఈడీకి ఫిర్యాదు
ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగే ఐపీఎల్ మ్యాచ్‌లకు సంబంధించిన వేలాది కాంప్లిమెంటరీ పాస్‌లు, టికెట్లు అర్హులైన యువ క్రికెటర్లకు చేరకుండా.. హెచ్‌సీఏ పెద్దలు వాటిని బ్లాక్ మార్కెట్‌కు మళ్లిస్తున్నారన్నది ప్రధాన ఆరోపణ. సామాన్య భక్తుడికి దేవుడి దర్శనం ఎంత కష్టమో, సామాన్య క్రికెట్ అభిమానికి ఉప్పల్ స్టేడియం టికెట్ దక్కడం అంతకంటే కష్టంగా మారింది. ఈ కృత్రిమ కొరత సృష్టించి కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారంటూ టీసీఏ కార్యదర్శి గురువారెడ్డి ఈడీకి ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంలో కేవలం టికెట్ల మాఫియానే కాకుండా, క్లబ్ సభ్యత్వాల్లో కూడా భారీ అక్రమాలు జరిగినట్లు తెలుస్తోంది. గతంలో ఉన్న 103 ఒరిజినల్ క్లబ్‌లను రికార్డుల నుంచి మాయం చేసి, వాటి స్థానంలో 80కి పైగా నకిలీ క్లబ్‌లను హెచ్‌సీఏలో చేర్చారని టీసీఏ ఆరోపిస్తోంది. ఈ నకిలీ క్లబ్‌ల ద్వారా అసోసియేషన్ ఎన్నికల్లో ఓట్లను మేనేజ్ చేయడమే కాకుండా, వాటి పేరిట వచ్చే నిధులను కూడా దారి మళ్లిస్తున్నారనేది వీరి వాదన. పబ్లిక్ ప్రాపర్టీగా ఉండాల్సిన జీహెచ్ఎంసీ క్లబ్‌లను కూడా ప్రైవేట్ వ్యక్తులు కబ్జా చేశారన్న అంశాన్ని టీసీఏ తన ఫిర్యాదులో ప్రత్యేకంగా ప్రస్తావించింది.
ఏకంగా రూ. 600 కోట్ల అవినీతి
గత పదేళ్ల కాలంలో బీసీసీఐ నుంచి వచ్చిన నిధుల వినియోగంలో సుమారు 600 కోట్ల రూపాయల వరకు అవినీతి జరిగిందని టీసీఏ సంచలన ఆరోపణ చేసింది. క్రికెట్ మౌలిక సదుపాయాల కల్పన కోసం కేటాయించిన ఈ నిధులు.. క్షేత్రస్థాయిలో ఎక్కడా కనిపించడం లేదని, కానీ అధికారుల వ్యక్తిగత ఆస్తులు మాత్రం అమాంతం పెరిగాయని ఆరోపిస్తున్నారు. జగన్ మోహన్ రావుపై ఫోర్జరీ , నిధుల మళ్లింపు ఆరోపణలతో సీఐడీ విచారణ జరుగుతుండగా, ఇప్పుడు ఈడీ కూడా రంగంలోకి దిగితే మరిన్ని షాకింగ్ విషయాలు బయటపడే అవకాశం ఉంది.
గత ఐపీఎల్‌లోనే బయటపడిన స్కాం
నిజానికి ఐపీఎల్ లాంటి భారీ టోర్నీలు జరిగినప్పుడు పారదర్శకత అనేది అత్యంత ముఖ్యం. కానీ, హెచ్‌సీఏలో పాతుకుపోయిన రాజకీయాలు, పవర్ బ్రోకర్ల హవా వల్ల తెలంగాణలో క్రికెట్ అభివృద్ధి కుంటుపడుతోందన్న ఆవేదన క్రీడాకారుల్లో కనిపిస్తోంది. టికెట్ల అమ్మకాల్లో పారదర్శకత లేకపోవడం, ఫైర్ సేఫ్టీ లాంటి కనీస ప్రమాణాలు పాటించకపోవడం వల్ల భవిష్యత్తులో ఐపీఎల్ మ్యాచ్‌లు హైదరాబాద్ నుంచి తరలిపోయే ప్రమాదం ఉందని టీసీఏ హెచ్చరిస్తోంది. ఈడీ జోక్యం చేసుకుని హెచ్‌సీఏ ఖాతాలను, లావాదేవీలను నిశితంగా పరిశీలిస్తేనే.. ఈ క్రికెట్ స్కామ్ వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరో తేలే అవకాశం ఉంది.


