ప్రధానమంత్రి నరేంద్రమోదీ హత్యకు మావోయిస్టులు హత్యకు కుట్ర చేస్తున్నారని పుణె పోలీసులు ఓ కథనాన్ని వెల్లడించారు. ఇటీవల భీమా -కోరెగాం దాడులకు సంబంధించిన నిందితులను అరెస్ట్ చేశారు. ఆ నిందితుల దగ్గర లభించిన ఓ లేఖ ప్రకారం… రాజీవ్ గాంధీని హత్య చేసిన తీరులో … నరేంద్రమోదీని అంతమొందించడానికి కుట్ర చేశారని పుణె పోలీసుల కథనం. అంటే… వారు మానవ బాంబుల్లా మారి మావోయిస్టులు హత్యకు కుట్ర చేస్తున్నారని చెబుతున్నారన్నమాట. హేతువాదులు భగవంతుడు ఉన్నారని నమ్మరు. అయినా హేతువాదులు ఈ విధంగా ప్రార్థిస్తారు. ఓ భగవంతుడా ( భగవంతుడనేవాడు ఉంటే ) నా అత్మను ( ఆత్మ అనేది ఉంటే ) దానిని కాపాడండి. దీనిపై నా స్పందన ఏమిటంటే… ప్రధానమంత్రి నరేంద్రమోదీపై హత్యాయత్నం ( జరిగి ఉంటే) తీవ్రంగా ఖండిస్తున్నాను.
చాలా అనుమానాలు.. అనేక ప్రశ్నలు ..!
ప్రపంచ చరిత్రలో ఎప్పుడైనా చూడండి… ప్రముఖ నేతలు, నియంత స్వభావం ఉన్న వాళ్లు తన చర్యల ద్వారా ప్రజల్లో వ్యతిరేకత వచ్చినప్పుడు… ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఈ కుట్ర సిద్ధాంతాల్ని ప్రవేశపెడుతూంటారు. ప్రపంచం మొత్తం ఎందుకు .. ఒక్క ఇండియాలోనే చూద్దాం.. ప్రతి ఎన్నికలకు ముందు ఇందిరాగాంధీపై.. హత్యకు కుట్ర లేదా హత్యాయత్నాల ఘటనలు బయటపడుతూ ఉండేవి. ఇలాంటి వాటి ద్వారా సానుభూతి ఓట్లు పొందాలనేది ఇందిరాగాంధీ ప్రయత్నం. ఆమె హత్యకు గురయింది కాబట్టి… ఆ హత్యాయత్నాలు అబద్దమని మనం చెప్పలేం. కానీ ఈ హత్యాయత్నాల ప్రచారం ద్వారా రాజకీయ నాయకులు సానుభూతి పొందాలనే ప్రయత్నాలు ఎప్పటి నుంచో ఉన్నాయని మాత్రం చెప్పగలం. అందుకే నరేంద్రమోదీ పై హత్యాయత్నం గురించి కేంద్ర ప్రభుత్వం చాలా ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది.
ఒకటో ప్రశ్న…
చంపాలనుకునేవారు ఎన్నికలకు ఏడాది ముందు ప్లాన్ చేస్తారా..?
ప్రధానమంత్రి నరేంద్రమోదీని చంపాలనుకునేవారు ఎవరైనా ఏడాది ముందు ప్రణాళిక వేసుకుంటారా..?. ఎవరూ ఎన్నికలకు ఏడాది ముందు ప్లాన్ చేయరు. ఎందుకంటే… ఇలాంటివి ఏమైనా జరిగితే..మోదీకి ఆయనకు పెద్ద ఎత్తున సానుభూతి వస్తుంది. మోదీని వ్యతిరేకించే వారు.. ఫాసిజంను వ్యతిరేకించే వారు..ఎవరైనా ఎన్నికలకు ముందు ఆయనపై దాడి చేస్తే.. పెద్ద ఎత్తున సానుభూతి వస్తుంది. ఫాసిజం బలపడుతుంది. బీజేపీ విస్తరిస్తుంది. ఈ విషయం తెలిసీ మోడీ వ్యతిరేకులు ఎవరైనా చేస్తారా..? ఆయన బలపడటాన్ని ఆహ్వానిస్తారా..?
రెండో ప్రశ్న…
ఆత్మాహుతి దాడులు చేసిన చరిత్ర మావోయిస్టులకుందా..?
మావోయిస్టులకు దాడులకు పాల్పడరని నేను అనను.. కానీ వారికి ఆత్మహుతి దాడులకు పాల్పడిన చరిత్ర లేదు. ఇంత వరకూ ఒక్కసారి కూడా ఇలాంటి దాడులకు పాల్పడలేదు. ఇప్పటి వరకూ లేదు కాబట్టి.. ఇక ముందు ఉండదని చెప్పలేం.. కానీ… ఎల్టీటీఈ, కాశ్మీర్ లాంటి తీవ్రవాదులు మాత్రం… సూసైడ్ బాంబర్స్ గా మారారు కానీ… మావోయిస్టులు ఆత్మహుతి దళాలుగా మారలేదు. ఒక వేళ మావోయిస్టులు.. తమ విధానాన్ని మార్చుకుని.. తాము కూడా ఆత్మహుతి దాడులకు పాల్పడాలని నిర్ణయించుకుని ఉంటే.. దానికి సంబంధించిన ఆధారాలు ప్రభుత్వం దగ్గర ఉండాలి.
మూడో ప్రశ్న
కశ్మీర్ తీవ్రవాదులు చేయలేని దాడిని మావోయిస్టులు చేయగలుగుతారా..?
కేంద్రహోంమంత్రి రాజ్ నాథ్ సింగ్.. మావోయిస్టులను పూర్తిగా అణచివేశామని పదే పదే చెబుతున్నారు. ఎక్కడికక్కడ మావోయిస్టులను ఏరి పారేశామని… వారంతా బలహీనపడ్డారని చెప్పుకొచ్చారు. మోదీ ప్రభుత్వం సాధించిన ఘనతల్లో మావోయిస్టుల అణచివేత కూడా ఉంది. ఇలా బలహీన పడిన మావోయిస్టులు.. పారిపోతున్న మావోయిస్టులు.. నేరుగా ప్రధానమంత్రిపై దాడి చేసేంత సాధానాసంపత్తిని ఎలా సంపాదించుకున్నారు..? ప్రధానికి అత్యంత అసాధారణమైన భద్రత మధ్య ఉంటారు. అలాంటి భద్రత ఉన్నవారిపై మావోయిస్టులు దాడికి ఏర్పాట్లు చేసుకున్నారంటే..వారు ఆ మాత్రం బలపడి ఉండాలి. అంటే.. మావోయిస్టులు బలహీనపడ్డారని.. ప్రభుత్వం అబద్దం చెప్పిందా..?
నాలుగో ప్రశ్న
భీమా-కోరెగాం దాడుల ఘటనతో ఎందుకు ముడిపెడుతున్నారు..?
నరేంద్రమోదీపై దేశవ్యాప్తంగా దళితుల వ్యతిరేకత మహారాష్ట్రలోని భీమా-కోరెగాం… దాడుల ఘటన తర్వాత పెరిగింది. బీమా-కోరెగాంలో దళితుల ప్రదర్శనపై.. కుల అహంకారంతో అల్లరి మూకలు దాడులు చేశాయి. ఇప్పుడు ఈ అల్లర్లలో మావోయిస్టులు ఉన్నారని చెప్పుకునేందుకు ఈ విషయాన్ని బీమా-కోరెగాం దాడుల ఘటనతో ముడిపెడుతున్నారు. ఈ దాడులు దళితులు చేశారంటే.. దళితుల వ్యతిరేకత వస్తుంది. దీంట్లో మావోయిస్టులు ఉన్నారని చెప్పడం ద్వారా రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారా..?. దళితులు-మావోయిస్టుల మధ్య సంబంధాలున్నాయని చెప్పదల్చుకున్నారా..? భీమా-కోరెగాంలో మతవాదులు చేసిన దాడులపై దేశం దృష్టిని మళ్లించడానికి చేస్తున్నారా..? దళితాలు ఆగ్రహం నుంచి దేశం దృష్టిని మళ్లించడానికి చేస్తున్నారా..?
అతి పెద్ద అనుమానం..!
ప్రధానిపై దాడిని ఓ చిన్న పోలీస్ స్టేషన్ సిబ్బంది చెప్పడమేమిటి..?
సాధారణంగా ఓ ఎమ్మెల్యేపై దాడికి కుట్ర జరిగినట్లు బయటకు తెలిసినా.. హయ్యస్ట్ కేడర్ పోలీసు అధికారులు వివరాలు వెల్లడిస్తారు. అలాంటిది ప్రధానమంత్రిపై కుట్ర జరిగితే.. పుణె పోలీసులు చెప్పడమేమిటి..? ప్రధానమంత్రి భద్రత అత్యున్నత స్థాయిలో ఉంటుంది. ఏం జరిగినా ముందు వాళ్లకు సమాచారం వెళ్తుంది. సెంట్రల్ ఎజెన్సీస్ ఉన్నాయి.. సెంట్రల్ హోమ్ మినిస్టర్ ఉన్నారు… వీళ్లందరూ మోదీపై హత్యాయత్నం గురించి మాట్లాడలేదు. వీరెవరూ మాట్లాడకుండానే పుణె పోలీసులు ప్రకటించడం ఏమిటి..?. నరేంద్రమోదీ విధానాలు నచ్చని వారు కూడా.. ఆయనపై వ్యక్తిగత దాడికి ప్రయత్నిస్తే తీవ్రంగా ఖండించాల్సిందే. కానీ నిజంగా కుట్ర జరిగి ఉంటే.. పుణె పోలీసులే ఎందుకు మాట్లాడుతున్నారు. కేంద్రహోంమంత్రి, హోంమంత్రిత్వ శాఖ ఎందుకు మాట్లాడదు. ..?. ప్రధానమంత్రి కార్యాలయం ఎందుకు మాట్లాడదు..?
ఈ ప్రశ్నలన్నింటికి కేంద్రం సమాధానం చెప్పాల్సి ఉంటుంది. లేకపోతే.. నరేంద్రమోదీ ఎన్నికల ముందు సానుభూతి కోసం చేస్తున్న ప్రయత్నంగానే చూడాలి. అందుకే కేంద్ర దర్యాప్తు సంస్థలు వెంటనే రంగంలోకి దిగాలి. ఎవరో ఎవరికో రాసిన ఉత్తరం ఆధారంగా నిర్ధారించకూడదు. అందుకే దీన్ని పుణె పోలీసులకు వదిలేయకూడదు. అందుకే విచారణ సంస్థలు.. సాక్ష్యాధారాలతో సహా బయటకురావాలి. అంతే కానీ.. రాజకీయ సానుభూతి కోసం ప్రయత్నించడం కరెక్ట్ కాదు.