బిల్ గేట్స్ ఏపీ, మహారాష్ట్రలో పర్యటించడంపై కొందరు మేధావులు,ఏపీని నాశనం చేయడానికి ఎప్పుడూ రెడీగా ఉండే వైసీపీ నేతలు అతిగా స్పందిస్తున్నారు. ఆయనతో జెఫ్రీ ఎప్ స్టీన్ తో కలిసి నేరాలకు పాల్పడినట్లుగా ప్రచారం చేస్తున్నారు. ఏవేవో సోషల్ మీడియా పుకార్లను తెచ్చి నిందిస్తున్నారు. అలాంటి వ్యక్తిని ఇండియాకు ఎందుకు ఆహ్వానించారని.. ఎందుకు స్వాగతించారని సొల్లు చెబుతున్నారు. బిల్ గేట్స్ వ్యక్తిగతంగా తప్పు చేస్తే అమెరికా చట్టాలు వదిలి పెట్టవు. ఆయనపై ఎలాంటి నేరారోపణలు లేవు. అయినా ఆయన రాకపై సోషల్ మీడియాలో ఖాతాలున్నాయని ..చేతిలో మీడియా ఉందని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు.
ఎప్స్టీన్తో పరిచయాలపై బిల్ గేట్స్ విచారం
బిల్ గేట్స్ తన గతంలో జెఫ్రీ ఎప్ స్టీన్తో ఉన్న పరిచయాల పట్ల ఇప్పటికే పలుమార్లు బహిరంగంగా విచారం వ్యక్తం చేశారు. ఆయనతో గడిపిన ప్రతి నిమిషానికి నేను చింతిస్తున్నాను అని ఆయన స్వయంగా పేర్కొన్నారు. ఒక వ్యక్తి తన వ్యక్తిగత జీవితంలో తీసుకున్న కొన్ని పొరపాట్లు లేదా నిర్ణయాల వల్ల ఆయన సాధించిన అద్భుతమైన సాంకేతిక విజయాలను, ప్రపంచానికి అందించిన సాఫ్ట్వేర్ విప్లవాన్ని తక్కువ చేసి చూడటం సరికాదు. అమెరికా వంటి దేశాల్లో చట్టం ఎవరినీ వదిలిపెట్టదు. అక్కడ ఆయనపై నేరారోపణలు ఏవీ రుజువు కాలేదు . కేవలం ఒక దాతృత్వ కోణంలోనే పరిచయాలు పెంచుకున్నారని స్పష్టం చేశారు.
భారత్లో గేట్స్ ఫౌండేషన్ అపార సేవలు
బిల్ గేట్స్ కేవలం సంపదను కూడబెట్టడమే కాకుండా, తన సంపాదనలో అత్యధిక భాగాన్ని సమాజానికి తిరిగి ఇవ్వాలనే ఉద్దేశంతో గేట్స్ ఫౌండేషన్ను స్థాపించారు. 2026 సంవత్సరానికి గాను ఈ ఫౌండేషన్ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 9 బిలియన్ డాలర్లు అంటే సుమారు రూ. 90,000 కోట్లు రికార్డు బడ్జెట్ను ప్రకటించింది. ముఖ్యంగా భారత్లో 2003 నుండి హెచ్ఐవి నివారణ, పోలియో నిర్మూలన, మాతా శిశు ఆరోగ్యం వంటి రంగాల్లో ఈ ఫౌండేషన్ వేల కోట్లు ఖర్చు చేసింది. దాదాపు 6 లక్షల కొత్త హెచ్ఐవి ఇన్ఫెక్షన్లను నివారించడంలో ఈ సంస్థ కీలక పాత్ర పోషించిందనేది కాదనలేని వాస్తవం.
ఏపీకి అనేక రకాలుగా సాయం
అమరావతి పర్యటనలో ఆయన ఆసక్తి కనబరిచిన ఆర్టీజీఎస్ , ఏఐ ఆధారిత ఆరోగ్య సేవలు, వ్యవసాయ సాంకేతికతలు అన్నీ భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సోపానాలు. కుప్పంలో అమలవుతున్న సంజీవని వంటి ప్రాజెక్టులు పేదలకు మెరుగైన వైద్యం అందించడంలో గేట్స్ ఫౌండేషన్ ఇస్తున్న సహకారానికి నిదర్శనం. అంతర్జాతీయ స్థాయిలో ఒక టెక్ దిగ్గజం గా, మహా దాత గా పేరున్న వ్యక్తిని ఎప్స్టీన్ ఫైల్స్ పేరుతో నిందించడం అంటే, మన అభివృద్ధికి తోడ్పడుతున్న వ్యక్తిని విమర్శించడమే. టెక్ ప్రపంచంపై నిందలు వేసే క్రమంలో వాస్తవాలను విస్మరించి, కేవలం వివాదాలకే ప్రాధాన్యత ఇవ్వడం మేధావి వర్గం సంకుచిత స్వభావాన్ని సూచిస్తోంది. ఇది మానవ లక్షణం అనిపించుకోదు. దురదృష్టవశాత్తూ మన దగ్గర అలాంటి లక్షణాలు ఉన్న వాళ్లు ఎక్కువగా ఉన్నారు.


